గత సార్వత్రిక ఎన్నికలకు రెండు నెలల ముందు కాంగ్రెస్ పార్టీలో చేరిన ఒకప్పటి సినీ నటి ఊర్మిళ మటోండ్కర్.. ఇప్పుడు ఆ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ముంబయ్ నార్త్ నుంచి లోక్ సభకు పోటీ చేసిన ఆమె సమీప బీజేపీ అభ్యర్ధి చేతిలో ఓడిపోయారు. అప్పటి నుంచి కాంగ్రెస్ నాయకత్వంపై, పార్టీ వ్యవహారాలపై అసహనంగా ఉన్న ఆమె ఈనెల 10వ తేదీన ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఆమె ఇప్పుడు శివసేన పార్టీలో చేరుతున్నారని ఆమెపై ఓ వార్త హల్ చల్ చేస్తోంది.

 

 

ఊర్మిళ శివసేనలో చేరేందుకు నిర్ణయించుకున్నారని.. ఇందుకు సంబంధించిన చర్చలు కూడా జరిగాయని వార్తలు వచ్చాయి. దీనిపై ఊర్మిళ స్పందించారు. “నేను ఏ రాజకీయ పార్టీలో చేరటం లేదు. ఇవన్నీ ఊహాగానాలే. ఇటువంటి వార్తలు సృష్టించడం తగదు. మీడియా దయచేసి ఇటువంటి నిరాధారమైన వార్తలను ప్రచారం చేయోద్దు” అని అన్నారు. ఊర్మిళ శివసేనలో చేరడానికి ఆ పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే సన్నిహితులతో సంప్రదించారని వార్తలు వచ్చాయి. త్వరలో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఈ వార్తలకు ప్రాధాన్యం ఏర్పడింది. కానీ ఈ వార్తలన్నింటినీ ఊర్మిళ తన ప్రకటనలో కొట్టి పారేశారు.

 

 

కాంగ్రెస్ పార్టీపై పెట్టుకున్న నమ్మకం ఆ పార్టీలోని స్థానిక నాయకత్వం వమ్ము చేసిందని ఆమధ్య వ్యాఖ్యానించారు. దీనిపై ఆమె రాసిన లేఖ కూడా సంచలనమైంది. తాను కాంగ్రెస్ లో చేరటానికి కారకులైన వారే తన ఓటమి అనంతరం తనపై ధ్వేషం చూపారని ఊర్మిళ లేఖలో ఆవేదన వ్యక్తం చేసారు. నటిగా గతంలో మంచి పేరు తెచ్చుకున్న ఊర్మిళ కాంగ్రెస్ పై మక్కువతో ఆ పార్టీలో చేరారు. కానీ.. ఆరు నెలల్లోపే ఆ పార్టీకి రాజీనామా చేశారు.

 


మరింత సమాచారం తెలుసుకోండి: