మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య వ్యవహారం టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధాన్ని పెంచుతోంది. కోడెల ఆత్మహత్యకు మీరు కారణం అంటే మీరు కారణం అని రెండు పార్టీలు పోటాపోటీగా విమర్శలు చేసుకుంటున్నాయి. జగన్ వేధింపుల వల్లే కోడెల ఆత్మహత్య చేసుకున్నాడని చంద్రబాబు నుంచి గల్లీ లీడర్ వరకూ టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. అందుకు దీటుగా వైసీపీ నేతలు కూడా టీడీపీ అవమానాల కారణంగానే కోడెల ఆత్మహత్య చేసుకున్నాడని మండిపడుతున్నారు.


ఈ నేపథ్యంలో వైసీపీ నేత రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్ర బాబు నాయుడు పెట్టిన అవమానాలతోనే మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు మరణించారని వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఆరోపించారు. వైయస్‌ఆర్‌ సీపీ ప్రభుత్వం ఎక్కడా ఉద్దేశ్యపూర్వకంగా కోడెలపై కేసులు పెట్టలేదన్నారు. గత కొద్ది రోజులుగా కోడెలకు చంద్రబాబు కనీసం అపాయింట్‌మెంట్‌ కూడా ఇవ్వలేదన్నారు.


కోడెల తాను నమ్మిన నాయకుడు చంద్రబాబు పార్టీ చేసిన అవమానంతోనే ఆత్మహత్య చేసుకున్నారని భావిస్తున్నామన్నారు. వర్ల రామయ్య లాంటి వ్యక్తులు కోడెలను దూషించడం వెనుక చంద్రబాబు పాత్ర స్పష్టంగా కనిపిస్తోందన్నారు. సొంత మామ ఎన్టీఆర్‌, రంగా లాంటి వ్యక్తుల మరణం వెనుక చంద్రబాబు ప్రమేయం ఉందని అందరికి తెలిసిన విషయమేనని రోజా విమర్శించారు.


మరోవైసీపీ నేత ఎమ్మెల్యే అంబటి రాంబాబు కూడా చంద్రబాబు తీరుపై మండిపడ్డారు. కోడెల మాకు రాజకీయ ప్రత్యర్థి మాత్రమే అని, వ్యక్తిగత ప్రత్యర్థి కాదన్నారు. ఓ సీనియర్‌ నేత చనిపోతే టీడీపీ శవ రాజకీయాలు చేస్తుందని మండిపడ్డారు. కోడెల మృతి వెనుక మిస్టరీ ఉందని అనుమానం వ్యక్తం చేశారు. మాజీ స్పీకర్‌ కోడెల ఆత్మహత్య చేసుకుంటే చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌ కూడా ప్రభుత్వ హత్య అని మాట్లాడుతున్నారు. సాక్షాత్తు నారా చంద్రబాబు రంగంలోకి దిగి వేధింపుల వల్లే కోడెల ఆత్మహత్య చేసుకున్నారని, దేశంలోనే ఇలాంటి సంఘటన లేదని ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేశారని అంబటి రాంబాబు మండిపడ్డారు.


మరింత సమాచారం తెలుసుకోండి: