మాజీ సభాపతి కోడెల అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. నరసరావుపేటలోని గుంటూరు రోడ్డులో ఉన్న స్వర్గపురిలో కోడెల అంత్యక్రియలు జరుగనున్నాయి. కోట నుంచి ప్రధాన రహదారి మీదుగా కిలోమీటర్ మేర స్వర్గపురికి అంతిమ యాత్ర సాగనుంది. అనంతరం 11 గంటలకు కోడెల అంత్యక్రియలు జరుగుతాయి. అయితే.. అంత్యక్రియల నిర్వహణను ప్రభుత్వ లాంఛనాలతో జరిపించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి ఆయన కుటుంబ సభ్యుల నుంచి వ్యతిరేకత ఎదురైంది.

 

 

 

 కోడెల అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో జరిపించేందుకు కుటుంబసభ్యుల నిరాకరించారు. ఈ మేరకు కుటుంబ సభ్యుల అభిప్రాయాన్ని టీడీపీ నేతలు వెల్లడించారు. మాజీ ఎమ్మెల్యే, గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు కోడెల కుటుంబసభ్యుల అభిప్రాయాన్ని మీడియాకు వెల్లడించారు. ప్రభుత్వం కోడెలపై కక్ష సాధింపు చర్యలతో కేసులు పెట్టి ఆయన్ను అవమానాలకు గురిచేసి ఇప్పుడు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించటం తమకుక అవసరం లేదని కుటుంబసభ్యులు పేర్కొన్నారని తెలిపారు. కాగా.. కోడెల అంత్యక్రియలకు టీడీపీ అధినేత  చంద్రబాబునాయుడు హాజరుకానున్నారు. నరసరావుపేట కోటలో కోడెల పార్థివదేహాన్ని  అభిమానులు సందర్శిస్తున్నారు. కోడెల మృతికి సంతాపంగా నేడు నరసరావుపేటలో స్వచ్ఛంద బంద్ పాటిస్తున్నారు పట్టణవాసులు. వ్యాపార, విద్యాసంస్థలను నేడు బంద్ పాటించాలని ఛాంబర్ ఆఫ్ కామర్స్ కోరడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా నర్సరావుపేటలో భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. పలు సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీస్ పికెట్లు కూడా ఏర్పాటు చేశారు. ముందు జాగ్రత్తగా నర్సరావుపేటలో 144 సెక్షన్ విధించారు.

 

 

 

కోడెల అంత్యక్రియలు జరుగనున్న స్వర్గపురిని కోడెల స్పీకర్ గా ఉన్న సమయంలో అభివృద్ధి చేశారు. ఎన్నో స్మశానాలను ఆయన అభివృద్ధి చేశారు. అలా అభివృద్ధి చేసిన స్వర్గపురిలోనే ఆయన అంత్యక్రియలు జరుగనున్నాయి. ఈ సంధర్భంగా నరసరావుపేట ఆయన అభిమానులతో కిక్కిరిసిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: