వైసీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 1,26,728 గ్రామ, వార్డ్ సచివాలయ ఉద్యోగాల భర్తీ కోసం జులై నెలలో నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. గ్రామ, వార్డ్ సచివాలయ పరీక్షలు ఈ నెల 1వ తేదీ నుండి 8వ తేదీ వరకు జరిగాయి. ఈ పరీక్షలకు 21.69 లక్షల ధరఖాస్తులు రాగా పరీక్షలకు 19.74 లక్షల మంది హాజరయ్యారు. ఆరు రోజుల పాటు ఈ పరీక్షలను అధికారులు నిర్వహించారు. 
 
గ్రామ, వార్డ్ సచివాలయ పరీక్షల ఫలితాలు 19వ తేదీ లేదా 20వ తేదీన అధికారులు ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఓ ఎం ఆర్ పత్రాల స్కానింగ్ ఇప్పటికే పూర్తయిందని తెలుస్తోంది. తుది పరిశీలన కూడా నిన్నటితోనే పూర్తయిందని సమాచారం అందుతుంది. గ్రామ, వార్డ్ సచివాలయ ఫలితాల ద్వారా ఎంపికైన వారు అక్టోబర్ 2వ తేదీ నుండి విధుల్లో చేరాల్సి ఉంటుంది. 
 
ప్రభుత్వం వీరికి 15,000 రుపాయలు స్టైఫండ్ చెల్లిస్తుంది. ఉద్యోగంలో చేరిన 2 సంవత్సరాల తరువాత శాశ్వత పే స్కేలు ప్రభుత్వం వర్తింపజేయనుంది. వార్డ్ సచివాలయాల్లో 9 విభాగాలకు సంబంధించిన 33,501 పోస్టులు గ్రామ సచివాలయాల్లో 13 విభాగాల్లో 95,088 పోస్టులు ఉన్నాయి. రాష్ట్రంలో ఇంత భారీగా గ్రామ, వార్డ్ సచివాలయాల ఉద్యోగాలు భర్తీ కానుండడంపై యువత సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 
 
గ్రామ, వార్డ్ సచివాలయ ఉద్యోగాల కొరకు నోటిఫికేషన్ లో విడుదలైన ఉద్యోగాలకు తగినంతమంది ఎంపిక కాకపోతే అర్హత మార్కులను తగ్గిస్తామని ప్రభుత్వం అధికారిక వెబ్ సైట్లో పేర్కొంది. రాష్ట్ర వ్యాప్తంగా 14,944 గ్రామ, వార్డ్ సచివాలయాలను ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నట్లు తెలుస్తుంది. పరీక్ష ఫలితాల అనంతరం ఎంపికయిన అభ్యర్థులకు సర్టిఫికెట్ల పరిశీలన చేసి ఉద్యోగ నియామక పత్రాలను ప్రభుత్వం అందిస్తుందని సమాచారం. 


 



మరింత సమాచారం తెలుసుకోండి: