క్షేత్రస్ధాయిలో జరుగుతున్న వ్యవహారం చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి.  ఆత్మహత్య చేసుకుని చనిపోయిన అసెంబ్లీ మాజీ స్పీకర్, సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు వ్యవహారాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. చంద్రబాబు చేస్తున్న శవరాజకీయాన్ని సహించలేక సీనియర్ నేత, క్రియాశీలక సభ్యుడు అన్నపురెడ్డి నర్సిరెడ్డి టిడిపికి రాజీనామా చేసేశారు.

 

రాజీనామా చేసిన నర్సిరెడ్డి చంద్రబాబు చేస్తున్న శవరాజకీయాలను తప్పు పట్టారు. కోడెల కొడుకు, కూతురు వల్ల జిల్లాలో చాలామంది టిడిపి నేతలు, కార్యకర్తలు పడిన ఇబ్బందులను వివరాలతో సహా చెప్పారు.  ఐదేళ్ళు అరాచకాలకు పాల్పడిన కొడుకు, కూతురును కోడెల చనిపోయిన తర్వాత సొంత లాభం కోసమే చంద్రబాబు రాజకీయం చేస్తున్నట్లు మండిపడ్డారు.

 

నర్సిరెడ్డి లాగ చాలామంది నేతలు రాజీనామాలు చేయకపోయినా చంద్రబాబుకు మద్దతుగా మాత్రం మాట్లాడటం లేదు. కోడెల మృతిని రాజకీయం చేయటంలో చంద్రబాబుకు మద్దతుగా  బుచ్చయ్యచౌదరి, కింజరాపు అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు లాంటి అతికొద్ది మంది నేతలు మాత్రమే మాట్లాడుతున్నారు. మిగిలిన నేతల్లో చాలామంది అసలు కోడెల ఆత్మహత్య గురించి ఎటువంటి ఆరోపణలు, విమర్శలు చేయటమే లేదు.

 

నిజానికి గుంటూరు జిల్లాలోని పల్నాడు ప్రాంతంలో ఉన్న నేతలే జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడటం లేదు. ఎందుకంటే కొడుకు, కూతురు బాధితుల్లో చాలామంది నేతలు ప్రత్యక్షంగానో పరోక్షంగానే ఉన్నారు కాబట్టే. కొడుకు శివరామకృష్ణ, కూతురు విజయలక్ష్మిలు సాగించిన అరాచకాలు మామూలుగా లేవని టిడిపి నేతలే మొన్నటి వరకూ బహిరంగంగానే విమర్శించిన విషయం అందరికీ తెలిసిందే.

 

అందుకనే చంద్రబాబు శవరాజకీయాలకు మద్దతుగా నిలవలేక అసలు ఆ విషయాన్నే చాలామంది నేతలు ప్రస్తావించటం లేదు. కోడెల కూతురు, కొడుకు అరాచకాలను చంద్రబాబు మొదట్లోనే అడ్డుకునుంటే ఇపుడీ పరిస్ధితి కోడెలకు వచ్చేదే కాదని కూడా చాలామంది నేతలు అభిప్రాయపడుతున్నారు. అందుకనే చంద్రబాబు తీరు నచ్చక, మద్దతు ఇవ్వలేక చాలామంది శవరాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: