ఒకే దేశం,  ఒకే భాష అంటూ బిజెపి జాతీయ అధ్యక్షుడు,  కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై దక్షిణాదికి చెందిన వివిధ  రాజకీయ పార్టీల నేతలే కాకుండా సినీ ప్రముఖులు  సైతం అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు .   ఒకే దేశం,  ఒకే భాష అంటూ హిందీ భాషా దినోత్సవం సందర్భంగా అమిత్ షా  చేసిన వ్యాఖ్యలు ఇప్పటికీ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.  అమిత్ షా వ్యాఖ్యలను  తాజాగా తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ సైతం విభేదించారు.  హిందీ భాష అమలు ఎక్కడైనా సాధ్యం అవుతుందేమో కానీ దక్షిణాది లో మాత్రం సాధ్యం కాదని ఆయన తేల్చి చెప్పారు.


  దక్షిణాదిలో హిందీ భాష  అమలును తమిళనాడు ప్రజలు  అంగీకరించరని,  దేశమంతటా ఒకే భాష ఉండటం దేశాభివృద్ధికి మంచిదేమో కావచ్చు కానీ మన దేశంలో ఒకే ఒక  భాష లేదు కదా అంటూ ప్రశ్నించారు . దేశ  వ్యాప్తంగా ఒకే భాష విధానాన్ని  ఉత్తర భారతీయులు కూడా అంగీకరించరని అయన  చెప్పుకొచ్చారు.  ఇక అమిత్ షా  వ్యాఖ్యలపై కర్ణాటక ముఖ్యమంత్రి ఎడ్యూరప్ప కూడా అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు.  తాము  కన్నడ  భాష , సంస్కృతీ అధిక  ప్రాధాన్యత ఇస్తామని అన్నారు . తమకు హిందీ భాష పట్ల వ్యతిరేకత లేకపోయినప్పటికీ, కన్నడ  భాష మాత్రమే తమకు ముఖ్యమని ఆయన అన్నారు .


 హిందీని  ఉమ్మడి  భాష చేయాలన్న అమిత్ షా వ్యాఖ్యలపై సినీ నటుడు కమల్ హాసన్ కూడా తీవ్రంగా వ్యతిరేకించారు . హిందీని బలవంతంగా రుద్దాలని చూస్తే భారీ ఉద్యమాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు . జల్లికట్టు అనేది కేవలం శాంపిల్ మాత్రమేనని , దాని కంటే పెద్ద ఉద్యమమే జరుగుతుందని కమల్ కేంద్రాన్ని హెచ్చరించారు . ఏ షా , సామ్రాట్  కూడా దేశం లో ఒకే భాష విధానాన్ని అమలు చేయలేరని చెప్పారు . 


మరింత సమాచారం తెలుసుకోండి: