ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీ 2.0 సర్కారులో విదేశాంగ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారి జైశంకర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పాకిస్థాన్‌కు దిమ్మ‌తిరిగే వ్యాఖ్య‌లు చేశారు.  సుమారు 75 నిమిషాల పాటు సాగిన ఈ సమావేశంలో.. కశ్మీర్, విదేశీ సంబంధాలు, అంతర్జాతీయంగా భారత్ స్థాయి తదితర అంశాలపై జైశంకర్ మాట్లాడారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) భారత్‌లో అంతర్భాగమని, ఏదో రోజు దానిపై భారత్‌కు భౌతికంగా కూడా న్యాయాధికారం లభిస్తుందని విదేశాంగ మంత్రి జైశంకర్ స్ప‌ష్టం చేశారు. 


కశ్మీర్ విషయంలో ప్రజలు చెప్పేదానిపై ఓ స్థాయిని దాటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని విదేశాంగ మంత్రి జైశంకర్ అన్నారు. ``ఒక పొరుగుదేశం నుంచి మనకు ప్రత్యేక సవాల్ ఎదురవుతున్నది. ఆ దేశం సాధారణ సరిహద్దు దేశంగా మారి, సీమాంతర ఉగ్రవాదంపై చర్యలు చేపట్టేంతవరకు అది మనకు సవాల్‌గానే మిగలనుంది`` అని  పేర్కొన్నారు. ఆర్టికల్ 370 రద్దు అనేది పాకిస్థాన్‌తో సమస్య కాదు అని, సీమాంతర ఉగ్రవాదమే అసలు సమస్య అని చెప్పారు. ఆ దేశంతో చర్చలు జరుగాలంటే.. మొదట ఉగ్రవాదంపైనే జరుగాలని స్పష్టం చేశారు. పాక్‌తో ఇకపై పీవోకేపైనే చర్చలు సాగుతాయని, కశ్మీర్‌పై కాదని ఇటీవల పలువురు నేతలు వ్యాఖ్యానించడంపై మీడియా ప్రశ్నించగా.. పీవోకేపై మా వైఖరి చాలా స్పష్టంగా ఉంది. పీవోకే భారత్‌లో అంతర్భాగం. ఏదో రోజు దానిపై మనకు భౌతికంగానూ న్యాయాధికారం లభిస్తుంది అని పేర్కొన్నారు. 


కశ్మీర్‌లో నెలకొన్న పరిస్థితులపై పలు దేశాలు ఆందోళన వ్యక్తం చేయడంపై జైశంకర్ స్పందిస్తూ.. ఆర్టికల్ 370ని రద్దు చేసేందుకు భారత్‌కు గల కారణాలను అంతర్జాతీయ సమాజం అర్థం చేసుకుంటుందని చెప్పారు. ఆర్టికల్ 370 అనేది తాత్కాలిక నిబంధన. వాస్తవానికి ఇది క్రియారహితంగా ఉంది. సంకుచిత స్వభావం కలిగిన కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం దీన్ని దుర్వినియోగం చేశారు. అభివృద్ధిని అడ్డుకుని, వేర్పాటువాదాన్ని పెంచి పోషించారు. ఈ వేర్పాటువాదాన్ని అడ్డుపెట్టుకుని పాకిస్థాన్ సీమాంతర ఉగ్రవాదానికి పాల్పడుతున్నది అని జైశంకర్ వివరించారు. కశ్మీర్‌పై 1971 నుంచీ కూడా భారత వైఖరి స్పష్టంగానే ఉందని, ఇందులో మార్పు ఉండబోదన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: