మేకతోటి సుచరిత...నవ్యాంధ్రప్రదేశ్ తొలి మహిళా హోం మంత్రి అనే చెప్పొచ్చు. ఎందుకంటే గత టీడీపీ ప్రభుత్వంలో మహిళా మంత్రులు ఉన్న...హోం మంత్రి బాధ్యతలు మాత్రం చినరాజప్ప నిర్వహించారు. అంతకముందు ఉమ్మడి ఏపీలో దివంగత వైఎస్సార్ సబితా ఇంద్రారెడ్డికి బాధ్యతలు అప్పగించారు. ఇక తండ్రిని ఫాలో అవుతూ....సీఎం జగన్ కూడా తన కేబినెట్ లో మహిళా నేత సుచరితకు హోం బాధ్యతలు ఇచ్చారు. అందులోనూ సుచరిత ఎస్సీ సామాజికవర్గానికి చెందిన నాయకురాలు కావడం గమనార్హం.


అయితే సుచరిత వైఎస్సార్ హయాంలో 2009 లో ప్రత్తిపాడు నుంచి కాంగ్రెస్ తరుపున గెలిచి తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. ఆ తర్వాత వైఎస్సార్ మరణం, జగన్ కొత్త పార్టీ పెట్టడంతో ఆమె అందులోకి వెళ్ళి 2012 ఉప ఎన్నికల్లో విజయం సాధించింది. ఇక 2014లో ఓడిపోయిన సుచరిత...2019 ఎన్నికల్లో ఘనవిజయం సాధించింది. మొదటి నుంచి పార్టీని నమ్ముకుని ఉండటంతో జగన్ సుచరితకు కీలకమైన హోం మంత్రి బాధ్యతలు అప్పగించారు.


కాకపోతే మొదట్లో మహిళా హోం మంత్రిగా ఎంతవరకు రాణిస్తుందో అని చాలామంది అనుమానం వ్యక్తం చేశారు. కానీ ఆ అనుమానాలన్నిటిని పటాపంచలు చేస్తూ హోం శాఖ బాధ్యతలని సమర్ధవంతంగా నిర్వర్తిస్తూ.... సత్తా చాటుతున్నారు. శాంతి భద్రతల విషయంలో ఏ మాత్రం కాంప్రమైజ్ కాకుండా ముందుకు వెళుతున్నారు. వైసీపీ వంద రోజుల పాలనలో రాష్ట్రంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చూసుకున్నారు. అటు మద్యపాన నిషేధంలో భాగంగా ఎక్సైజ్ మంత్రి నారాయణస్వామితో కలిసి బెల్ట్ షాపులు ఏరివేశారు.


అలాగే సోషల్ మీడియాలో సీఎం జగన్, వైసీపీ మంత్రులపై అసభ్యంగా కామెంట్లు పెట్టిన వారి తాటా తీయడంలో ఏ మాత్రం వెనుకడుగు వేయలేదు. అలాగే వైసీపీ వాళ్ళు తమ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని టీడీపీ నేతలు చేసిన ఆరోపణలని సమర్ధవంతంగా తిప్పికొట్టారు. గతంలో టీడీపీ ప్రభుత్వం హయాంలో వైసీపీ కార్యకర్తలపై జరిగిన దాడులని గుర్తు చేసి కౌంటర్ ఇచ్చారు. అదేవిధంగా ఇటీవల టీడీపీ పిలుపునిచ్చిన ఛలో ఆత్మకూరుని విజయవంతంగా అడ్డుకున్నారు. ఇదే క్ర‌మంలో ప్ర‌భుత్వం, జ‌గ‌న్ త‌ర‌పున బ‌ల‌మైన వాయిస్ వినిపించ‌డంలో చాలా మంది సీనియ‌ర్ల కంటే ముందుండి వాళ్ల‌కే షాక్ ఇస్తున్నారు.


తాజాగా బోటు ప్ర‌మాదం విష‌యంలో రెండు రోజుల పాటు రాజ‌మండ్రిలోనే మ‌కాం వేసి బాధితుల్లో ధైర్యం నింప‌డంతో పాటు ప్ర‌భుత్వం త‌ర‌పున వారికి సాయం అందేలా ఎప్ప‌టిక‌ప్పుడు ప‌నులు ప‌ర్య‌వేక్షించారు. ఇక సుచరిత మంత్రిగానే కాకుండా ప్రత్తిపాడు నియోజకవర్గంలో ప్రజల సమస్యలు పరిష్కరించడంలో ముందున్నారు. మొత్తం మీద సుచరిత నవ్యాంధ్ర తొలి మహిళా హోం మంత్రిగా సత్తా చాటుతున్నారు.  ఇంకా చెప్పాలంటే జ‌గ‌న్ కేబినెట్లో ఉన్న ముగ్గురు మ‌హిళా మంత్రుల్లో సుచ‌రితకే టాప్ మార్కులు వేయాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: