తెలంగాణలో ఉప ఎన్నిక వేడి రాజుకుంది. త్వరలో జరగనున్న హుజూర్‌నగర్‌ ఉప ఎన్నిక కోసం ప్రధాన పార్టీలన్ని సర్వం సిద్ధమయ్యాయి. 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హుజూర్‌నగర్‌ నుంచి టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలిచిన విషయం తెలిసిందే. అయితే 2019 లోక్ సభ ఎన్నికల్లో ఉత్తమ్ నల్గొండ నుంచి పోటీ చేసి గెలవడంతో...ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీంతో హుజూర్‌నగర్‌ ఉపఎన్నిక అనివార్యమైంది. ఇక హుజూర్‌నగర్‌ టికెట్ దక్కించుకోవడం కోసం టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల్లో తీవ్ర పోటీ నెలకొంది.


టీఆర్ఎస్ నుంచి ముందస్తు ఎన్నికల్లో ఓడిపోయిన శానంపూడి సైదిరెడ్డి మళ్ళీ పోటీ చేయాలని భావిస్తుండగా...మంత్రి జగదీష్ రెడ్డి మాత్రం మరొకరికి అవకాశం కల్పిస్తే బాగుంటుందని భావిస్తున్నారు. టీఆర్ఎస్ వర్గాలు అయితే ఎంపీగా ఓడిపోయిన కవితకు టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మరి అధినేత కేసీఆర్ ఎవరికి టికెట్ కేటాయిస్తారు అనేది సస్పెన్స్ గా మారింది. టీఆర్ఎస్ లో అలా ఉంటే కాంగ్రెస్ లో హుజూర్‌నగర్‌ టికెట్ కోసం పెద్ద లొల్లే జరుగుతుంది.


ఇప్పటికే హుజూర్‌నగర్‌ టికెట్ పద్మావతి పోటీ చేస్తారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించేశారు. ఉత్తమ్ భార్య అయిన పద్మావతి మొన్న ఎన్నికల్లో కోదాడ నుంచి పోటీ చేసి స్వల్ప మెజారిటీతో ఓడిపోయారు. అయితే పద్మావతికి టికెట్ కేటాయించడం పట్ల వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి వర్గం ఫైర్ అవుతుంది. ముఖ్యంగా టికెట్ ఆశిస్తున్న శ్యామల కిరణ్‌రెడ్డి  తమను సంప్రదించకుండానే అభ్యర్థిని ఎలా ప్రకటిస్తారని ఊగిపోతోంది. ఈ విషయాన్ని స్థానిక నేతలతో కలిసి రేవంత్‌ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి.. టికెట్ తనకు దక్కేవిధంగా చూడాలని ఆయన్ని కోరారు.


దీంతో రంగంలోకి దిగిన రేవంత్‌ రెడ్డి హుజూర్‌నగర్‌ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో టికెట్‌ను శ్యామలకి ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇక్కడ నుంచే ఉత్తమ్‌- రేవంత్‌ వర్గాల మధ్య టికెట్‌ వార్‌ మొదలైంది. అటు పద్మావతిని గెలిపించుకునేందుకు ఉత్తమ్‌ ఇప్పటికే స్థానిక నేతలని కలుస్తూ ముందుకెళుతున్నారు. ఇటు రేవంత్ కూడా శ్యామలకు టికెట్ ఇప్పించేందుకు అధిష్టానం వద్ద గట్టి లాబీయింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి చివరికి ఈ టికెట్ లొల్లి కాంగ్రెస్ లో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: