పొరుగుదేశ‌మైన పాకిస్థాన్ విష‌యంలో మ‌రో సంచ‌ల‌న అంశం వెలుగులోకి వ‌చ్చింది. క‌శ్మీర్‌లో ఆర్టిక‌ల్ 370 ర‌ద్దుతో....ఏదో జ‌రిగిపోతోంద‌ని గ‌గ్గోలు పెడుతున్న పాక్‌...త‌మ దేశంలోని మానవ హ‌క్కుల విష‌యంలో మాత్రం క‌ళ్ల‌కు గంత‌లు క‌ట్టుకుంద‌ని స్ప‌ష్టమ‌వుతోంది. పాకిస్థాన్‌లో హిందువు మ‌తానికి చెందిన అమ్మాయిలు అప‌హ‌ర‌ణ‌కు గుర‌వుతున్నారు. గ‌త నాలుగు నెలల్లో సుమారు 30 మంది హిందూ యువ‌తిలు కిడ్నాప్‌కు గురైన‌ట్లు తేలింది. ఇలా ఆరోప‌ణ‌లు చేసింది ఎవ‌రో కాదు.... పాకిస్థాన్ ముస్లీం లీగ్‌కు చెందిన నేత. 


న‌వాజ్ పార్టీకి చెందిన‌ ఖేల్ దాస్ కోహిస్తానీ పాక్ పార్ల‌మెంట్‌లో ఈ సంచ‌ల‌న‌ అంశాన్ని ప్ర‌స్తావించారు. హిందువు మ‌హిళ‌ల ప‌ట్ల ఎన్నాళ్లు ఈ అకృత్యాలు జ‌రుగుతాయ‌ని ఆయ‌న అడిగారు. హిందువులను ఎన్నాళ్లు చంపుతారు, ఎన్నాళ్లు హిందూ ఆల‌యాల‌ను ధ్వంసం చేస్తార‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. సింధు ప్రావిన్సులోని గోట్కీ, ఉమ‌ర్‌కోట్ ప్రాంతంలోనే ఎందుకు ఇలాంటి ఘ‌ట‌న‌లు జ‌రుగుతున్నాయ‌ని ఆయ‌న నిల‌దీశారు. మొత్తం సింధు ప్రాంతానికి ఈ మంట‌లు పాకుతాయ‌న్నారు. సింధులో కొంద‌ర్ని అరెస్టు చేయాల‌ని ఈ సంద‌ర్భంగా ఎంఎన్ఏ నేత ఖేల్‌దాస్ కోహిస్తానీ కోరారు.

ఇదిలాఉండ‌గా....సింధు ప్రావిన్సులోని ల‌ర్కానాలో ఇటీవ‌ల ఓ హిందూ మెడిక‌ల్ విద్యార్థిని అనుమానాస్ప‌ద రీతిలో చ‌నిపోయింది. యూనివ‌ర్సిటీ మాత్రం ఆ అమ్మాయి సూసైడ్ చేసుకున్న‌ట్లు చెబుతోంది. కానీ పేరెంట్స్ మాత్రం మ‌ర్డ‌ర్ జ‌రిగిన‌ట్లు ఆరోపిస్తున్నారు. పాకిస్తాన్ లోని లర్కానా లో నమ్రితా చందానీ అనే మెడికల్ స్టూడెంట్ అనుమానాస్పద స్థితిలో మరణించింది. అక్కడి ఓ డెంటల్ కాలేజీలో ఫైనల్ ఇయర్ స్టూడెంట్ అయిన ఈమె తన హాస్టల్ గదిలో విగత జీవిగా కనిపించింది. ఆమె మెడ చుట్టూ ఓ తాడు బిగించి ఉందని పోలీసులు తెలిపారు. అయితే ఈమె సూసైడ్ చేసుకుందా లేక మర్డరా అన్న విషయాన్ని ఇప్పుడే చెప్పలేమన్నారు. నమ్రిత మైనారిటీ అయిన కారణంగానే ఆమెను హత్య చేశారని ఆమె కుటుంబ సభ్యులు అంటున్నారు. కాగా-తన సోదరి దూపట్టా ధరించి ఉండగా.. దాని స్థానే కేబుల్ వైర్ కనిపించిందని, ఇది ముమ్మాటికీ హత్యేనని ఈమె సోదరుడు పేర్కొంటున్నారు. పాకిస్తాన్ లో మైనారిటీలుగా ఉన్న హిందువులపై దాడులు జరుగుతున్నాయని, హిందూ ఆలయాలను దుండగులు ధ్వంసం చేస్తున్నారని వార్తలు వస్తున్న తరుణంలో ఈ డెంటల్ విద్యార్థిని మరణం అనేక అనుమానాలకు తావిస్తోంది.  



మరింత సమాచారం తెలుసుకోండి: