అయోధ్య కేసు విచారణకు సుప్రీంకోర్టు డెడ్‌లైన్ విధించింది. ఈ కేసు విషయంలో వాదనలు వచ్చే అక్టోబర్ 18వ తేదీ నాటికి ముగించాలని సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది. పిటిషనర్లు కోరితే మధ్యవర్తిత్వ ప్యానెల్‌ను తిరిగి తెరిచే అవకాశాన్ని పరిశీలిస్తామని స్పష్టం చేసింది. మధ్యవర్తిత్వ ప్యానెల్ తన పనిని ప్రారంభిస్తే తీర్పు రిజర్వు చేసిన తర్వాత కూడా తన నివేదికను ఇవ్వొచ్చన్నారు.


అయోధ్య రామ జన్మ భూమి వివాదంపై విచారణ సత్వరమే జరిగి, తీర్పు వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ కేసులో విచారణను 26వ రోజు కొనసాగించింది. జస్టిస్ గొగోయ్ నవంబరు 17న పదవీ విరమణ చేయబోతున్న తరుణంలో.. అంతకు ముందే తీర్పును వెలువరించేందుకు కృషి జరుగుతోంది.


ముస్లిం పార్టీ తరపున వాదనలు వినిపించిన సీనియర్ అడ్వకేట్ రాజీవ్ ధవన్ శుక్రవారం విచారణకు విరామం ఇవ్వాలని సుప్రీంకోర్టును కోరారు. దీంతో హిందూ, ముస్లిం పార్టీలు తమ తమ వాదనలను పూర్తి చేయడానికి ఎంత సమయం అవసరమో చెప్పాలని సుప్రీంకోర్టు కోరింది. ఈ నేపథ్యంలో ముస్లిం పార్టీ బుధవారం స్పందిస్తూ తమ వాదనలను వినిపించేందుకు ఓ వారం సమయం అవసరమని ధర్మాసనానికి తెలిపింది. జస్టిస్ గొగోయ్ మాట్లాడుతూ వాదనలు పూర్తయిన తర్వాత తీర్పు రాయడానికి తమకు కనీసం నాలుగువారాల సమయం అవసరమవుతుందనీ.. అందువల్ల అక్టోబరు 18నాటికి వాదనలను పూర్తి చేయాలని కోరారు. విచారణతోపాటు మధ్యవర్తిత్వ ప్రక్రియ కూడా కొనసాగవచ్చునని సీజేఐ జస్టిస్ గొగోయ్ చెప్పారు. ఒకవేళ సామరస్యపూర్వకమైన పరిష్కారం మధ్యవర్తిత్వం ద్వారా సాధ్యమైతే, దానిని సుప్రీంకోర్టుకు సమర్పించవచ్చునని తెలిపారు. మరి అక్టోబర్ 18నాటికి ఈ వ్యవహారానికి ఫుల్ స్టాప్ పడుతుందో లేదో చూడాలి. యావత్ దేశ ప్రజలు మాత్రం ఈ వివాదం ఎపుడు పరిష్కారం అవుతుందోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: