ఆంధ్రప్రదేశ్‌ మాజీ స్పీకర్‌..టీడీపీ సీనియర్‌ నేత కోడెల శివప్రసాద్‌ మృతిపై హైదరాబాద్ పోలీసులు  దర్యాప్తు వేగవంతం చేశారు. ఆత్మహత్యకు దారితీసిన కారణాలతో పాటు...సన్నిహితులతో కోడెల ఏమైనా చెప్పుకున్నారా అని ఆరా తీసే పనిలో పడ్డారు పోలీసులు... కోడెల కాల్‌డాటా , పోస్టుమార్టం నివేదిక ఆధారంగా దర్యాప్తు జరుపుతున్నారు .


హైదరాబాద్‌లోని నివాసంలో బలవన్మరణానికి పాల్పడిన కోడెల శివప్రసాద్‌ కేసులో...పోలీసులు కీలక ఆధారాలను సేకరించే పనిలో పడ్డారు. ఉస్మానియా ఆసుపత్రి వైద్యులు ఇప్పటికే పోస్టుమార్టం నివేదికను పోలీసులకు అందించారు.  మెడపై వైరుతో చుట్టుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఫోరెన్సిక్‌ రిపోర్టులో పేర్కొన్నారు. దాంతో డాక్టర్ కోడెలది సూసైడ్‌ అని నిర్దారణకు వచ్చిన పోలీసులు..అందుకు గల కారణాలను విశ్లేషించే పనిలో పడ్డారు.  


డాక్టర్ కోడెల గదిలో.. తన పంచెకు సంబంధించిన వస్త్రంతో పాటు..మెడకు చుట్టుకున్న వైర్, పెద్దమొత్తంలో మాత్రలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆయన అనారోగ్యానికి గురవటంతో ఈ మందులు వాడుతున్నారని మొదట పోలీసులు భావించారు. కానీ.. దర్యాప్తులో అనేక ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. మొదట కుటుంబసభ్యుల నుంచే సమాచారం సేకరించే ప్రయత్నం చేసినా... వారు పోలీసులకు సహకరించ లేదు. పైగా బంజారాహిల్స్ పోలీసులు ప్రశ్నలతో విసిగిస్తున్నారంటూ కోడెల నివాసానికి వచ్చిన టీడీపీ నేతలతో కుటుంబ సభ్యులు చెప్పడంతో..పోలీసులు కూడా ఓ అడుగు వెనక్కి వేసారు. మరింత లోతుగా దర్యాప్తు జరిపారు.  


డాక్టర్ కోడెల శివప్రసాదరావు కూతురుతో పాటు ఆమె తల్లి నుంచి కూడా పోలీసులు సమాచారం సేకరించే ప్రయత్నం చేశారు. అయినా వారి నుంచి అంతంత మాత్రం విషయాలు వస్తుండటంతో..కోడెల వద్ద చాలాకాలం నుంచి గన్‌మెన్‌ గా పనిచేస్తున్న అద్నామ్‌ను విచారించారు పోలీసులు. కోడెల వ్యక్తిగత విషయాలతో పాటు..కొద్దిరోజుల కిందట గుంటూరులో కోడెలకు గుండెపోటు అంటూ వచ్చిన వార్తలపై కూడా పోలీసులకు కొత్త సమాచారం తెలిసింది . కొద్ది రోజుల కిందట గుంటూరులోని తన కూతురు హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్‌ తీసుకున్నారు కోడెల శివప్రసాద్‌. ఆ సమయంలో గుండె పోటు అంటూ ప్రచారం జరిగినా...తాజాగా ఆత్మహత్య అనంతరం...ఆ రోజు కూడా కోడెల మందు మాత్రలు మింగి సూసైడ్‌ అటెంప్ట్ చేశారని గుర్తించారు. దీంతో..గత కొద్ది రోజులుగా సూసైడల్ టెండెన్సీలో  కోడెల శివప్రసాద్‌ ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. మరోవైపు సూసైడ్‌ అనంతరం కోడెల రూమ్‌లో స్వాదీనం చేసుకున్న మాత్రలు  కూడా... సైక్రియాట్రిస్టు సలహాలతో తన బాడీని తన కంట్రోల్‌లో ఉంచుకునేందుకు వాడుతున్న టాబ్లెట్స్‌ గా గుర్తించారు. 


చాలా రోజులుగా కోడెల డిప్రెషన్‌లో ఉన్నారని అనుమానిస్తున్న పోలీసులు... చివరి సారిగా ఎవరితో అయినా తన విషయాలు చెప్పుకున్నారా అన్న కోణంలో దర్యాప్తు జరిపారు. కోడెల కాల్‌డాటాను పరిశీలించిన పోలీసులకు...ఆత్మహత్యకు ముందు బసవతారకం క్యాన్సర్‌ హాస్పిటల్‌లో 15 ఏళ్లుగా పని చేస్తున్న ఉద్యోగితో మాట్లాడినట్టు గుర్తించారు. గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన ఆమె..కోడెలతో సన్నిహితంగా ఉండేది. ఆత్మహత్యకు ముందు ఆమెతో మాట్లాడేందుకు కోడెల ఫోన్‌ చేశారు. ఆ సమయంలో ఆమె హాస్పిటల్‌లోని లిఫ్టులో వెళుతుండటంతో.. కొద్దిసేపటికే ఆమె ఫోన్‌ డిస్ కనెక్ట్  అయింది. ఫోన్‌ సిగ్నల్స్‌ వచ్చే ప్లేస్‌లోకి వచ్చి మళ్లీ కాల్‌బ్యాక్‌ చేసినా...కోడెల ఫోన్‌ స్విచ్ ఆఫ్ రావడంతో ఆమె వదిలేశారు . ఆ తరువాత కొద్దిసేపటికే సూసైడ్‌ వార్త తెలియడంతో ఆమె కూడా షాక్‌కు గురయ్యారు. కోడెల మాట్లాడిన ఆ కొద్దిసేపు ఆమెతో ఏం మాట్లాడారా? అన్న దానిపై పోలీసులు ఇప్పుడు దృష్టి పెట్టారు. 


కోడెల కుమారుడు శివరామ్‌ నుంచి కూడా సమచారం సేకరిస్తామంటున్నారు  పోలీసులు. మొత్తానికి కోడెల సూసైడ్‌ రాజకీయ దుమారం రేగుతుండటంతో...హైదరాబాద్ పోలీసులు కూడా ఈ కేసులో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఇన్వెస్టిగేషన్‌ పూర్తయ్యే వరకూ విషయాలు ఏవీ బైటకు లీక్‌ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: