రిటైర్డ్ ఐఏఎస్ సుజాతరావు అధ్యక్షతన నియమించిన నిపుణుల కమిటీ నిన్న సాయంత్రం సీఎం జగన్ ను కలిసింది. 182 పేజీల నివేదికను 100కు పైగా సిఫార్సులతో సమర్పించింది. 3 గంటల సమయం పాటు జరిగిన ఈ సమీక్షలో సీఎం జగన్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆరోగ్యశ్రీ పథకంలో వెయ్యి 
రూపాయలు బిల్లు దాటితే ఈ పథకం వర్తించేలా మార్పులు చేస్తున్నారు. ఈ పథకంలో భాగంగా మరో 2 వేల రకాల రోగాలకు వైద్యం అందించబోతున్నారు. 
 
నవంబర్ 1వ తేదీ నుండి, చెన్నై, బెంగుళూరు, హైదరాబాద్ నగరాల్లో ఉన్న సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులలో ఆరోగ్యశ్రీ కింద వైద్యం అందించబోతున్నారు. కొత్త ప్రతిపాదనలతో కూడిన ఆరోగ్యశ్రీ పథకం పశ్చిమ గోదావరి జిల్లాలో పైలెట్ ప్రాజెక్ట్ కింద జనవరి 1 నుండి అమలు కాబోతుంది. మిగతా జిల్లాల్లో ఏప్రిల్ 1వ తేదీ నుండి దశల వారీగా అమలు చేయబోతున్నారు. డిసెంబర్ 21వ తేదీ నుండి కొత్త హెల్త్ కార్డులు జారీ చేస్తామని సీఎం తెలిపారు. 
 
ప్రస్తుతం కిడ్నీ వ్యాధికి డయాలసిస్ చేయించుకుంటున్న వారికి 10,000 రూపాయలు ఇస్తున్న ప్రభుత్వం దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి 5,000 
రూపాయలు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. పక్షవాతం, పుట్టుకతో వచ్చే హెచ్ ఐ వీ, బోదకాలు, పోలియో, కుష్టు, తలసీమియా బాధితులకు నెలకు 5,000 రూపాయలు ఇచ్చేలా మార్గదర్శకాలను జారీ చేయాలని సీఎం తెలిపారు. 
 
నిపుణుల కమిటీ వైద్యులు ప్రభుత్వ ఆస్పత్రుల్లో పని చేస్తూ ప్రైవేట్ ఆస్పత్రుల్లో పని చేయకూడదని చాలా రాష్ట్రాల్లో ఇప్పటికే అమలులో ఉందని సూచించింది. ఇక్కడ కూడా ఆ విధానాన్ని అమలు చేయటానికి ప్రయత్నిస్తామని సీఎం తెలిపారు. ఖాళీగా ఉన్న వైద్యుల పోస్టుల భర్తీ కొరకు తక్షణమే నియామకాలు చేపట్టబోతున్నట్లు సమాచారం. పులివెందుల, మార్కాపురం, మచిలీపట్నం ప్రాంతాలలో కొత్త వైద్య కళాశాలలకు సీఎం ఆమోదం తెలిపారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: