కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరిపై వచ్చిన ఆరోపణలపై ప్రభుత్వం రహస్యంగా విచారణ జరిపిస్తోందా ?  క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు, అందుతున్న సమాచారం ప్రకారం విచారణ నిజమే అని అర్ధమవుతోంది.  రాజధాని ప్రాంతంలో సుజనా చౌదరి పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేశారన్న ఆరోపణలు ఎప్పటి నుండో వినిపిస్తున్న విషయం తెలిసిందే.

 

సుజనా పై ఉన్నది ఆరోపణలు మాత్రమే కాదని అవన్నీ నిజాలే అంటూ ఈమధ్యనే మంత్రి బొత్సా సత్యనారాయణ చేసిన ప్రకటన సంచలనం రేపింది. తన ప్రకటనకు ఆధారలుగా బొత్స సుజనా కొనుగోలు చేసిన భూములు ఇవే అంటూ సర్వే నెంబర్లు, ఎవరి పేరుతో కొన్నారు, ఎంతెంత భూములు కొనుగోలు చేశారన్న వివరాలను కూడా చెప్పారు.

 

అయితే సుజనా ఆ ప్రకటనను కొట్టి పారేశారు లేండి. బొత్స చేసిన ప్రకటన అంతా అబద్ధమని మంత్రి చెప్పిన భూములు తమకు తమ తల్లి పుట్టింటి తరపున వచ్చినవంటూ క్లారిటి ఇచ్చారు. నిజంగానే బొత్స చెప్పినట్లు ఇన్ సైడర్ ట్రేడింగ్ లోనే సుజనా కొనుగోలు చేసినా ఆ విషయాన్ని ఒప్పుకోరు కదా ?

 

సరే ఆరోపణలు, ప్రత్యారోపణలు ఎలాగున్నా ప్రభుత్వం మాత్రం సుజనావని చెబుతున్న భూములపై రహస్య విచారణ జరుపుతున్న విషయం బయటపడింది.  ఈ విషయాన్ని టిడిపికి మద్దతిచ్చే మీడియానే ప్రముఖంగా ప్రస్తావించింది. కృష్ణా జిల్లా కంచికచర్ల మండలంలోని మోగలూరు, మున్నలూరు, బత్తినపాడు, చెవిటికల్లు గ్రామాల్లో పరిధిలో విచారణ జరుగుతోంది. పై గ్రామాల్లో జరిగిన భూముల అమ్మకాలు, కొనుగోళ్ళను రైతుల నుండి వివరాలు సేకరించారు. సిఐడి, ఏసిబి, విజిలెన్స్, రెవిన్యు అధికారులు చేస్తున్న విచారణ బయటపడటం గమనార్హం.

 

ఇప్పటికే సుజనా ఆర్ధిక నేరాలపై సిబిఐ విచారణ జరుపుతోంది. బ్యాంకులను దాదాపు రూ. 9 వేల కోట్లకు ముంచేసిన కేసులు సుజనాపై నమోదయ్యాయి. అరెస్టు వారెంటు కూడా గతంలో జారీ అయ్యింది. కేసులు, అరెస్టు నుండి తప్పించుకునేందుకే సుజనా టిడిపి నుండి బిజెపిలోకి ఫిరాయించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: