యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌(యూజీసీ) మార్గదర్శకాల మేరకు డిగ్రీ కోర్సుల్లో అమలవుతున్న చాయిస్‌ బేస్డ్‌ క్రెడిట్‌ సిస్టమ్‌(సీబీసీఎస్‌) పటిష్టత, ప్రమాణాలు మెరుగుపడే విధంగా మార్పులకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ముందడుగు వేసింది. ఇందుకోసం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ రెండు రోజులుగా సమావేశమై చర్చలు సాగించింది. ఆయా వర్సిటీల డీన్ల అభిప్రాయాలను తెలుసుకుంది. కాలేజీల లెక్చరర్లు, విద్యార్థులు, ఇతర విద్యారంగ నిపుణులతోనూ చర్చించి సిలబస్‌లో మార్పులు చేయడంతోపాటు ప్రస్తుత సీబీసీఎస్‌ విధానాన్ని పటిష్టంగా అమలు చేయడానికి సూచనలు చేయనుంది.

 

 కమిటీ తొలి భేటీ ఇలా

డిగ్రీ కోర్సుల్లో చాయిస్‌ బేస్డ్‌ క్రెడిట్‌ విధానాన్ని యూజీసీ 2015–16 నుంచి అమల్లోకి తీసుకువచ్చింది. దీనిపై మార్గదర్శకాలు విడుదల చేసి ఐదేళ్లపాటు అమలయ్యేలా గడువు నిర్దేశించింది. ఈ గడువు 2020 మార్చితో ముగియనుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత సీబీసీఎస్‌ విధానాన్ని పూర్తి స్థాయిలో సమీక్షించి వాటిలోని లోటుపాట్లను సవరించి మరింతగా పటిష్టం చేసేందుకు విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం (నెల్లూరు) మాజీ ఉపకులపతి ప్రొఫెసర్‌ జి.రాజారామిరెడ్డి చైర్మన్‌గా ఏడుగురు ఉన్నత విద్యారంగ నిపుణులతో ఉన్నత విద్యామండలి కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ తొలి భేటీ మంగళ, బుధవారాల్లో విజయవాడలోని మండలి కార్యాలయంలో జరిగింది. ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ కె.హేమచంద్రారెడ్డి, కమిటీ చైర్మన్‌ జి.రాజారామిరెడ్డి, ప్రొఫెసర్‌ ఎన్‌.కిషోర్‌బాబు(ఆంధ్రావర్సిటీ), ప్రొఫెసర్‌ కె.త్యాగరాజు(ఎస్వీ వర్సిటీ), డాక్టర్‌ జి.శ్రీరంగం మాథ్యూ(ఆంధ్రాలయోలా కాలేజీ, విజయవాడ), డాక్టర్‌ బీ.ఆర్‌.ప్రసాదరెడ్డి (అసోసియేట్‌ ప్రొఫెసర్, ధర్మవరం), మెంబర్‌ కన్వీనర్లు డాక్టర్‌ కె.వి.రమణారావు(రిటైర్డ్‌ ప్రిన్సిపాల్‌), బి.ఎస్‌.సెలీనా(లెక్చరర్, అకడమిక్‌ సెల్, ఏపీఎస్‌సీహెచ్‌ఈ) తదితరులు పాల్గొన్నారు.

 

ఆయా వర్సిటీలలోని అకడమిక్‌ అఫైర్స్‌ డీన్లతో కమిటీ చర్చలు కొనసాగించింది. ఐదేళ్లక్రితం సీబీసీఎస్‌ విధానం ఎలా ప్రారంభించారు? ఇప్పుడెలా అమలవుతోంది? అన్న అంశాల్ని క్షుణ్ణంగా తెలుసుకుంది.  ప్రస్తుత సీబీసీఎస్‌ విధానంలో మార్పులుచేర్పులు అవసరమా? అడ్వాన్సు చేయాలా? కొత్తగా వస్తున్న పరిణామాలకు అనుగుణంగా ఏయే నూతన అంశాల్ని సిలబస్‌లో చేర్చాల్సి ఉంటుందో అనే అంశాలను నివేదించారు. కాగా, బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సుల సిలబస్‌లో మార్పులు, చేర్పులు చేసేందుకు సబ్జెక్టు కమిటీల్ని ఏర్పాటు చేయనున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: