కేసీఆర్ సర్కార్ కు  తెలంగాణ హైకోర్టు వరుసగా మొట్టికాయలు వేస్తోంది.  ఎర్రమంజిల్ భవనాన్ని కూల్చి తెలంగాణ అసెంబ్లీ నిర్మించాలన్న కెసిఆర్ ప్రభుత్వ నిర్ణయాన్ని ఇప్పటికే హైకోర్టు తప్పు పట్టిన విషయం తెలిసిందే . ఇక ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోలు ప్రజలకు అందుబాటులో లేవన్న కారణంగా ఒక వ్యక్తి హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలు చేయగా ,  విచారించిన హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారశైలిని తప్పుపట్టింది.  తెలంగాణ ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన 42 500 జీవోలను అధికారిక వెబ్ సైట్  పర్చలేదని పిటిషనర్ తన వ్యాజ్యంలో పేర్కొన్నారు.


 బుధవారం ఈ వ్యాజ్యాన్ని విచారించిన హైకోర్టు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రెటరీ ల కు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.  ప్రభుత్వం జారీచేసే జీవోలో పారదర్శకత పాటించాలని  రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు  సూచించింది.  రహస్య జీవోలు... దొడ్డి  దారి జీవోలు చెల్లవని తేల్చి చెప్పింది . ప్రభుత్వం జారీ చేసే జివోలన్నింటినీ  పబ్లిక్ డొమైన్ లో  ఉంచాలని ప్రభుత్వానికి సున్నితమైన హెచ్చరిక చేసింది.  తెలంగాణ ప్రభుత్వం జారీచేసే జీవోలను ప్రజలందరూ చూసేవిధంగా అధికారిక సామాజిక మాధ్యమాల్లో ఉంచాలంటూ హైకోర్టు వెల్లడించింది.


 కేసీఆర్ సర్కార్ కు కోర్టు మొట్టికాయలు వేయడం కొత్తేమి కాదని విపక్షాలు ఎద్దేవా చేస్తున్నాయి . సాగునీటి ప్రాజెక్టుల భూసేకరణ అంశం లో కావచ్చు ... ఇతరత్రా పలు అంశాల్లో కావచ్చు పలుసార్లు కోర్టు తప్పుపట్టిందని గుర్తు చేస్తున్నారు .    అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వ వైఖరిలో ఏమాత్రం మార్పు వచ్చినట్లు కన్పించడం లేదని అంటున్నారు . కోర్టు పదే, పదే అక్షింతలు వేస్తున్నా, అలాగే తమకు తోచినట్లుగా వ్యవహరించడం కేసీఆర్ సర్కార్ కు పరిపాటిగా మారిందని విపక్ష నేతలు విమర్శిస్తున్నారు .


మరింత సమాచారం తెలుసుకోండి: