ఆత్మహత్య చేసుకున్న అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు వ్యవహారంలో చంద్రబాబునాయుడు ఎందుకింతగా రచ్చ చేస్తున్నారు ? అంటే దానికి ఓ కారణం ఉందని పార్టీ నేతలే అంటున్నారు. చంద్రబాబు ఏది చేసినా దానికో లెక్క ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. కాకపోతే కొన్నిసార్లు ఆ లెక్కంటో తెలిసిపోతుంది. కొన్నిసార్లు మెల్లిగా తెలుస్తుందంతే.

 

చంద్రబాబు చేస్తున్న తాజా రచ్చకు లెక్కేంటంటే రాబోయే స్ధానిక సంస్ధల ఎన్నికలే అని సమాచారం. మొన్నటి సాధారణ ఎన్నికల్లో వైసిపి చేతిలో టిడిపి చావు దెబ్బ తిన్న విషయం అందరికీ తెలిసిందే. మామూలుగా అయితే టిడిపి ఇప్పట్లో కోలుకునే అవకాశాలైతే లేవన్నది వాస్తవం. ఆ విషయం అందరికీ అర్ధమవటంతోనే  కొందరు కీలక నేతలు పార్టీకి రాజీనామా చేసేశారు.

 

చాలామంది నేతలు చంద్రబాబు నాయకత్వం మీద నమ్మకం లేకే తమ దారి తాము చూసుకుంటున్న విషయం పార్టీలో కలకలం రేపుతోంది. నేతల్లో, కార్యకర్తల్లో ఆత్మస్ధైర్యం నింపటం ఎలాగన్న టెన్షన్ తో చంద్రబాబు అవస్తలు పడుతున్నారు. ఈ నేపధ్యంలోనే గుంటూరు జిల్లాలో దాడులని, ఆత్మకూరు గ్రామమని కొద్ది రోజులు రచ్చ చేశారు. ఆ రచ్చ ప్రభావం ఎంతుంటుందనే విషయంలో పార్టీలోనే భిన్నాభిప్రాయాలున్నాయనుకోండి అది వేరే సంగతి.

ఇంతలోనే అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల ఆత్మహత్య ఘటన వెలుగు చూసింది. ఇంకేముంది చంద్రబాబు వెంటనే శవరాజకీయాలు మొదలుపెట్టేశారు. రెండు రోజులుగా గగ్గోలు పెట్టేస్తున్నారు. నేతల్లో, కార్యకర్తల్లో తనపై సడిలిన నమ్మకాన్ని మళ్ళీ నిలబెట్టుకోవాలన్న టార్గెట్ తోనే చంద్రబాబు ఇంతగా రచ్చ చేస్తున్నట్లు అర్ధమైపోతోంది. సరే కోడెల విషయంలో చంద్రబాబు చేస్తున్న రచ్చపైన కూడా పార్టీ నేతల్లోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

 

మరి ఈ రచ్చ ప్రభావం పార్టీ నేతలు, కార్యకర్తలపై ఏమాత్రం ఉంటుందనేది భవిష్యత్తులో కానీ తెలీదు.  చలో ఆత్మకూరు రచ్చ లాగే ఇదికూడా రివర్సయితే  రేపటి స్ధానిక సంస్ధల ఎన్నికల్లో పార్టీ తరపున పోటి చేయటానికి గట్టి అభ్యర్ధులు కూడా దొరకరేమో ?


మరింత సమాచారం తెలుసుకోండి: