గోదావరిలో బోటు మునిగి 40 మంది వరకూ చనిపోయిన ఘటన తెలిసిందే. ఈ ప్రమాదం జరిగి ఇప్పటికి ఐదు రోజులు అవుతోంది. కానీ ఇంతవరకూ ప్రమాదానికి గురైన బోటును బయటకు తీయనే లేదు. ఐదు రోజుల తర్వాత కూడా ఇంకా కొందరి ఆచూకీ తెలియాల్సి ఉంది. తమవారి జాడ కానరాక ఇంకా ఎన్నో కుటుంబాలు తల్లడిల్లుతున్నాయి.


మరి ఇంతకీ ఆ బోటును ఎందుకు బయటకు తీయలేకపోతున్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ ఎఫ్, నేవీ నిపుణలు కూడా ఎందుకు బోటును పైకి తీయడంలో ఫెయిలవుతున్నారు. ఇందుకు కారణాలు ఏంటంటే.. ఆ ప్రాంతంలో భారీ సుడిగుండాలు ఉన్నాయట. అసలు ఇంతటి భయంకరమైన సుడిగుండా తన జీవితంలోనే చూడలేదని మునిగిపోయిన బోట్లను వెలికితీయటంలో అనుభవమున్న మత్స్యకారుడు కాకినాడకు చెందిన ధర్మాడి సత్యం చెబుతున్నారు.


బోటును బయటకు తీసేందుకు ధర్మాడి సత్యం బృందం విపరీతంగా ప్రయత్నిస్తోంది. అయితే వారి బోట్లను కూడా సుడిగుండాలు తమవైపు లాక్కునే ప్రయత్నం చేశాయట. ఇంతటి మహా సుడిగుండాన్ని తానెప్పుడూ ప్రత్యక్షంగా చూడలేదని.. డిస్కవరీ ఛానెల్‌లోనే చూశానని ధర్మాడి సత్యం చెబుతున్నాడు. దీంతో బోటును వెలికితీయటం కోసం ముంబయి నుంచి ప్రత్యేకంగా గౌరవ్‌ భక్షి అనే నిపుణుడిని రప్పించారు.


ఆ ప్రాంతంలో గోదావరి వేగం చాలా ఎక్కువగా ఉంది. అందువల్ల ఆపరేషన్ నిర్వహించాల్సిన బోట్లను ఎక్కువసేపు ఒకే చోట నిలిపి ఉంచలేకపోతున్నారు. బోటును వెలికితీసేందుకు వెయ్యి మీటర్ల పొడవైన భారీ తాడు తేవాలని నిర్ణయించారు. దానికి యాంకర్లు కట్టి బోటు మునిగిన ప్రదేశంలో జారవిడిచి బోటును పైకి తెచ్చే ప్రయత్నం చేయాల్సి ఉంది. ఆ ప్రాంతంలో మొత్తం మూడు సుడిగుండాలు ఉన్నాయని నిపుణలు చెబుతున్నారు. ఘటనాస్థలికి చేరుకునేందుకు ఎలాంటి రోడ్డు మార్గం లేకపోవడం కూడా బోటు తీసేందుకు ఆలస్యం అవ్వడానికి మరో కారణం.


మరింత సమాచారం తెలుసుకోండి: