ఆత్మహత్య చేసుకున్న సీనియర్ నేత, అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు విషయంలో చంద్రబాబునాయుడు ఎంత గగ్గోలు పెట్టేస్తున్నారో అందరూ చూస్తున్నదే. రెండు రోజుల గొడవ తర్వాత కోడెల కుటుంబానికి చంద్రబాబు మేలు చేశారా ? లేకపోతే మరింత కీడు చేశారా ? ఇపుడిదే చర్చ పార్టీలో జరుగుతోంది. నిజానికి కోడెల కుటుంబం మొత్తాన్ని గడచిన మూడు నెలలుగా పార్టీ నేతలు దూరంగా పెట్టేసిన విషయం అందరికీ తెలిసిందే.

 

కోడెలకున్న అధికారాన్ని అడ్డం పెట్టుకుని కొడుకు శివరామకృష్ణ, కూతురు విజయలక్ష్మి ఎంతటి అరాచకానికి పాల్పడ్డారో అందరికీ తెలిసిందే. అధికారం ఉంది కదా అని విర్రవీగితే అధికారం నుండి దిగిపోయిన తర్వాత ఎటువంటి పరిస్ధితులు ఎదుర్కోవాల్సొస్తుందనేందుకు కోడెల కుటుంబమే సజీవ ఉదాహరణ.

 

చంద్రబాబు ఆదేశాల వల్లే సీనియర్ నేతలందరూ కోడెల కుటుంబానికి దూరంగా ఉంటున్నారన్నది బహిరంగ రహస్యం.  కోడెల ఇపుడు ఆత్మహత్య చేసుకున్నారు కాబట్టి సరిపోయింది. లేకపోతే కోడెలను తొందరలోనే పార్టీ నుండి బయటకు సాగనంపటానికి రంగం కూడా సిద్ధమైందని పార్టీలోనే చర్చ జరుగుతోంది.

 

సరే ఇపుడు కోడెల లేరు,  మరి అరాచాకాలకు పాల్పడిన కొడుకు శివరామ్, కూతురు విజయలక్ష్మి విషయంలో చంద్రబాబు ఎటువంటి వ్యూహం అనుసరించ బోతున్నారు ? అన్నదే ఇపుడు ప్రధాన ప్రశ్నగా మిగిలిపోయింది. అందులోనే వారిద్దరి అరాచకాలకు పాల్పడిన వారిలో టిడిపి నేతలు, కార్యకర్తలే ఎక్కువ. వాళ్ళిద్దరిపై చెరో 25 కేసులు నమోదయ్యాయి. ఆ కేసుల్లో టిడిపి నేతలు చేసిన ఫిర్యాదులు కూడా ఉన్నాయి. కాబట్టి వాళ్ళంతా కోడెల సంతానంపై ఇంకా మండిపోతున్నారు.

 

ప్రభుత్వమైనా, టిడిపి నేతలైనా కోడెలను చూసే సంతానం విషయంలో కాస్త ఉపేక్షించారన్నది వాస్తవం. మరి ఇపుడు కోడెల లేరు కాబట్టి పోలీసులు, బాధితులు కొడుకు, కూతురు విషయంలో ఏ విధంగా వ్యవహరిస్తారనే విషయమే సస్పెన్సుగా మారింది. ఇందుకే కోడెల విషయంలో చంద్రబాబు చేసిన ఓవరయాక్షన్ ప్రభావం కుంటుంబంపై ఎలాగుంటుందో అనే చర్చ పెరిగిపోతోంది.

 


మరింత సమాచారం తెలుసుకోండి: