సీనియర్ నేత, అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య తర్వాత మొదలైన బురద రాజకీయాల్లోకి చంద్రబాబునాయుడు రాష్ట్ర గవర్నర్ బిశ్వజిత్ హరిచందన్ ను కూడా లాగుతున్నారు. కోడెల ఆత్మహత్యకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే కారణమంటూ గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. అధికారంలో నుండి దిగిపోయిన తర్వాత కోడెలను వేధించే ఉద్దేశ్యంతోనే వైసిపి ప్రభత్వం తప్పుడు కేసులు పెట్టినట్లు చంద్రబాబు ఫిర్యాదు చేయటమే విచిత్రంగా ఉంది.

 

 నిజానికి అసెంబ్లీ ఫర్నీచర్ ను దొంగతనం చేసినట్లు స్వయంగా కోడెలే ఒప్పుకున్నారు. అసెంబ్లీలో లేకపోతే కోడెల ఇంట్లో ఉండాల్సిన ఫర్నీచర్ కోడెల కొడుకు శివరామకృష్ణ షోరూములో ఎందుకుందనే విషయంలో కోడెల కూడా నోరిప్పలేదు. దొంగతనం చేసిన ఫర్నీచర్ ను కొడుకు షోరూములో వాడుకున్నది వాస్తవం. అందుకనే పోలీసులు కోడెలపై కేసు పెట్టారు. కోడెల మీద నమోదైంది కేవలం ఒక్క కేసు మాత్రమే.

 

కానీ చంద్రబాబు అండ్ కో మాత్రం కోడెలపై ప్రభుత్వం 19 తప్పుడు కేసులు పెట్టినట్లుగా అబద్ధపు  ప్రచారం చేస్తున్నారు. ఇక కొడుకు, కూతురుపై చెరో 20 కేసులు నమోదైన మాట వాస్తవమే. అందులో కూడా తప్పుడు కేసులేమీ లేవు. అధికారంలో ఉన్నపుడు చేసిన అరాచకాలకు బలైపోయిన బాధితులే గడచిన మూడు నెలల్లో ఫిర్యాదులు చేశారు. పోలీసులు కేసులు పెట్టారు. ఫిర్యాదు చేసిన వారిలో టిడిపి నేతలు కూడా ఉన్న విషయం గమనించాలి.

 

నిజానికి కోడెల ఆత్మహత్యకు ప్రధాన కారణం చంద్రబాబే. మూడు నెలలుగా కోడెలను దూరం పెట్టేశారు. నేతలెవరినీ కోడెలతో మాట్లాడనీయకుండా కట్టడి చేశారు. ఏ విషయంలో కూడా కోడెలకు చంద్రబాబు మద్దతుగా నిలబడలేదు. ఆ క్షోభతోనే కోడెల ఆత్మహత్య చేసుకున్నారని వైసిపి అంటోంది. వాస్తవాలు ఇలాగుంటే చంద్రబాబు మాత్రం జగన్ ప్రభుత్వంపై ఎదురుదాడి చేస్తున్నారు. ఇందులో భాగంగానే గవర్నర్ ను కలిశారు. మొత్తానికి తాను ఆడుతున్న బురద రాజకీయాల్లోకి చంద్రబాబు గవర్నర్ ను కూడా లాగేశారు.

 


మరింత సమాచారం తెలుసుకోండి: