తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఇన్నాళ్లు ప్రతిపక్షం ఊసే లేకుండా చేసిన సీఎం కేసీఆర్... ఏక చక్రాధిపత్యం చేద్దామనుకున్నారు. కానీ... ఇప్పుడు విపక్షాలే కాదు.... తన సొంత పార్టీలోనే వ్యతిరేకులు పుట్టుకొచ్చారు. గులాబీ ఓనర్లమంటూ తమ అసంతృప్తిని బాహాటంగానే వెళ్లగక్కుతున్నారు. బుజ్జగింపులు జరగగానే మళ్లీ సాయంత్రంలోగా మేము అలా అనలేదు... మీడియా తమ మాటలను వక్రీకరించింది... టీఆర్ఎస్ వ్యవస్థాపకుడు కేసీఆరే మాకు బాస్ అంటూ సాయంత్రం మరో ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తున్నారు.


ఇదిలా ఉంటే ప్రస్తుతం ఫుల్ జోష్ మీద ఉన్న బీజేపీ.. తెలంగాణలో ఎలాగైనా పాగా వేయాలని ఆరాటపడుతోంది. ఆ దిశగా అడుగులు వేస్తోంది కూడా. టీఆర్ఎస్ వైఫల్యాలను నొక్కి చెబుతూ... గులాబీకి చెక్ పెట్టేది కేవలం మేమే అంటూ కాషాయం నేతలు తమ వ్యూహాలతో ముందుకు సాగుతున్నారు. ఇందులో భాగంగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కేసీఆర్ ఎందుకు అధికారికంగా నిర్వహించడం లేదు అంటూ ప్రశ్నించడం మొదలుపెట్టింది. మజ్టిస్ పార్టీకి తొత్తుగా మారిన కేసీఆర్.. తెలంగాణ పోరాట యోధుల త్యాగాలను విస్మరిస్తున్నారని మండిపడుతున్నారు.


ఆపరేషన్ ఆకర్ష్ తో ఇఫ్పటికే పలు పార్టీల నేతలను కాషాయం గూటికి చేర్చుకున్న బీజేపీ.... ఇదే ప్రధానాస్త్రంగా దూసుకుపోతున్నట్లు కనిపిస్తుంది. కేసీఆర్ బతికుండగానే టీఆర్ఎస్ పార్టీని చంపుతామని ... ఇది కేసీఆర్ కళ్లారా చూడాలని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ చేసిన వ్యాఖ్యలు కాషాయం దళం ధీమాను స్పష్టం చేస్తున్నాయి. కానీ రాజకీయ ఎత్తుగడల్లో రారాజు అయిన కేసీఆర్.... ఆపరేషన్ ఆకర్స్ తో గులాబీ నేతలను తమ గూటికి రప్పించుకోవాలని చూస్తున్న బీజేపీ షాక్ ఇస్తూనే ఉన్నాడు. ఒక్కరంటే ఒక్క నేత కూడా తమ పార్టీ కాంపౌండ్ దాటకుండా ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. దీంతో ఎప్పటిలాగే కాషాయం నేతలు చతికిలపడుతున్నట్లే కనిపిస్తున్నారు. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే... రాష్ట్రంలో అధికారం సంగతి దేవుడెరుగు.. కనీసం పార్టీలో ఐక్యత ఉంటే చాలు అన్న చందంగా మారింది హస్తం నేతల తీరు.


పీసీసీ పదవి కోసం నాయకులు పడుతున్న పాట్లు, వేస్తున్న ఎత్తులు.. కొద్దిగా ప్రచారానికి వినియోగిస్తే బాగుండేది అనిపిస్తుంది. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీలో ముసలం మొదలైంది. రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిల మధ్య వార్ నడుస్తుందన్న అనుమానాలకు బలం చేకూరుస్తూ... మీడియా ముఖంగానే అరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు కూడా. హుజూర్ నగర్ ఉపఎన్నికలో టికెట్ కోసం ప్రస్తుతం యుద్ధం జరుగుతుండగా....పార్టీలోకి కొత్తగా వచ్చిన రేవంత్ సపోర్ట్ చేస్తున్న అభ్యర్థికి టికెట్ దక్కుతుందా? లేక సీనియర్ నేత ఉత్తమ్ తన సతీమణికి అధిష్టానం నుంచి టికెట్ ఇప్పించి పంతం నెగ్గించకుంటాడా? చూడాలి మరి.


తెలంగాణలో టీడీపీ ఉనికి గల్లంతు అయినట్లు .... కాంగ్రెస్ ను కూడా తొక్కేద్దామని అనుకున్న కేసీఆర్... ఇప్పుడు పార్టీలో చేరిన కిరాయిదార్లు, ఓనర్లతో సతమతం అవుతున్నాడు. ఎవరికి పదవి ఇస్తే... ఎవరు ఎలా రియాక్ట్ అవుతారో అని తల పట్టుకుంటున్నాడు. ఇలాంటి తరుణంలో బీజేపీ పుంజుకునేందుకు అవకాశాలు ఉన్నా.... కమలం పార్టీ అంతగా సిచువేషన్ ను క్యాష్ చేసుకోలేక పోతుంది అంటున్నారు రాజకీయ ప్రముఖులు. ఇలా అయితే కేసీఆర్ అసెంబ్లీలో చెప్పినట్లు మరో మూడు సార్లు అధికార పీఠం దక్కించుకుంటారనే చర్చించుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: