గత 27 ఏళ్లుగా...ఆధ్యాత్మిక స‌మ‌స్య నుంచి రాజకీయ సమస్యగా మారిన అయోధ్య కేసు కొలిక్కి రానుంది. అయోధ్యలోని రామజన్మభూమి, బాబ్రీ మసీదు భూ వివాదానికి నవంబర్‌ 15లోగా పరిష్కారం లభించే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ కేసులో రోజువారీ జరుగుతున్న విచారణను అక్టోబర్‌ 18లోగా పూర్తిచేయాలని సుప్రీంకోర్టు గడువు విధించింది. విచారణ అనంతరం తీర్పు వెలువరించటానికి తమకు కనీసం నాలుగు వారాల సమయం అవసరమని పేర్కొంది. 


అయోధ్య  కేసులో మధ్యవర్తిత్వ ప్రక్రియ విఫలం కావడంతో సుప్రీంకోర్టు ఆగస్టు 6వ తేదీ నుంచి రోజువారీ విచారణను చేపట్టిన సంగతి తెలిసిందే. మధ్యవర్తిత్వ బృందంలో ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్‌, ప్రముఖ న్యాయవాది శ్రీరాం పంచు సభ్యులుగా ఉన్నారు. అయోధ్య కేసును సామరస్యంగా పరిష్కరించేందుకు నాలుగు నెలలపాటు కృషి చేసిన ఈ బృందం ఎటువంటి పరిష్కారాన్ని కనుగొనలేకపోయింది. అయితే, పై సుప్రీంకోర్టు నవంబర్‌లో తీర్పును ప్రకటించే అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. ఈ కేసుపై విచారణ జరుపుతున్న ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి నేతృత్వం వహిస్తున్న ప్రధాన న్యాయమూర్తి రంజన్‌ గొగోయ్‌ నవంబర్‌ 17న పదవీ విరమణ చేయనున్నారు. దీంతో ఆయన పదవీ విరమణకు ముందే అయోధ్య కేసుపై తీర్పు వెలువడుతుందని భావిస్తున్నారు. అక్టోబర్‌ 18 వరకు సుప్రీంకోర్టు ముందు కేవలం 15 పనిదినాలు మాత్రమే ఉన్నాయి. ఇప్పటివరకు హిందూ పార్టీలు 16 రోజుల పాటు తమ వాదనలు వినిపించాయి. కాగా ముస్లిం పార్టీల తరఫున సీనియర్‌ న్యాయవాది రాజీవ్‌ ధవన్‌ 10 రోజుల పాటు వాదనలు వినిపించారు. తమ వాదనలు పూర్తి చేయడానికి ఇంకా ఎనిమిది రోజులు కావాలని ధవన్‌ కోరారు. తమకు రెండు రోజులు చాలని హిందూ పార్టీల పక్ష న్యాయవాదులు కే పరాశరన్‌, సీఎస్‌ వైద్యనాథన్‌ చెప్పారు. అవసరమైతే శనివారాలు కూడా విచారణను చేపడుతామని ధర్మాసనం తెలిపింది. 


కాగా చ‌ర్చ‌ల విష‌యంలో ఏం చేసినా.. అన్నీ అక్టోబర్‌ 18నాటికి పూర్తి కావాలని, ఆ తరువాత తీర్పును వెలువరించటానికి తమకు నాలుగు వారాల గడువు అవసరమని స్పష్టం చేసింది. వాదనలను పూర్తి చేయడానికి ఇంకా ఎంత సమయం కావాలో తెలుపాలని ధర్మాసనం మంగళవారం జరిగిన విచారణ సందర్భంగా హిందూ, ముస్లిం పక్షాలను కోరింది. ముగ్గురు సభ్యుల మధ్యవర్తిత్వ కమిటీకి నేతృత్వం వహిస్తున్న సుప్రీంకోర్టు మాజీ జడ్జి ఎఫ్‌ఎంఐ ఖలీఫుల్లా తమకు ఒక లేఖ రాశారని తెలిపింది. మధ్యవర్తిత్వ ప్రక్రియను పునరుద్ధరించాలని కొన్ని పక్షాలు ఆయనను కోరినట్టు జస్టిస్‌ ఖలీఫుల్లా ఆ లేఖలో తెలిపారని పేర్కొంది. ఆ కమిటీ మధ్యవర్తిత్వ ప్రక్రియను కొనసాగించవచ్చని, అక్కడ జరిగే పరిణామాలను రహస్యంగా ఉంచాలని ధర్మాసనం తెలిపింది. ప్రస్తుతం కోర్టులో జరుగుతున్న రోజువారీ విచారణ చివరి దశకు చేరుకున్నదని పేర్కొంది.


మరింత సమాచారం తెలుసుకోండి: