భార‌త్ విష‌యంలో పాకిస్థాన్ గింజుకోవ‌డం ఇంకా కొన‌సాగుతోంది. జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేస్తూ భారత్‌ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా పాకిస్థాన్‌ తన అక్కసును వెళ్లగక్కుతూనే ఉన్నది. తాజాగా ఇందులో ఇంకా చిత్ర‌మైన నిర్ణ‌యం తీసుకుంది. ప్రధాని నరేంద్రమోదీ.. జర్మనీ మీదుగా అమెరికా పర్యటనకు వెళ్లేందుకు తమ గగనతలాన్ని వినియోగించుకునేందుకు అనుమతిని నిరాకరించింది. ఈ మేరకు ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషనర్‌కు తమ నిర్ణయాన్ని వెల్లడించినట్లు పాక్‌ విదేశాంగ మంత్రి మహమ్మద్‌ ఖురేషి తెలిపారు. త‌ద్వారా పాక్ బుద్ధిని మ‌ళ్లీ చాటిచెప్పారు.


ఈనెల 21న ప్రధాని మోదీ అమెరికా పర్యటనకు వెళ్లాల్సి ఉంది. 22న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో కలిసి ఆయన ‘హౌదీ మోదీ’ కార్యక్రమంలో ప్రవాస భారతీయులతో సమావేశం కానున్నారు. ఈ నెల 27న ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీ సమావేశానికి హాజరుకానున్నారు. భారత ప్రధాని మోదీ ఈ నెల 21న జర్మనీ వెళ్లేందుకు, 28న తిరిగి వచ్చేందుకు వీలుగా తమ గగనతలాన్ని వినియోగించుకునేందుకు అనుమతి ఇవ్వాలని భారత్‌ కోరింది. అయితే ప్రస్తుతం కశ్మీర్‌లో నెలకొన్న పరిస్థితులు, అక్కడ భారత్‌ సాగిస్తున్న అరాచకాల నేపథ్యంలో అనుమతి ఇవ్వకూడదని నిర్ణయించినట్లు  పాక్‌ విదేశాంగ మంత్రి మహమ్మద్‌ ఖురేషి చెప్పుకొచ్చారు. 


ప్రధాని మోదీ విమానానికి పాక్‌ అనుమతి నిరాకరించడంపై భారత్‌ తీవ్రస్థాయిలో మండిపడింది. అంతర్జాతీయ సంప్రదానికి తిలోదకాలిచ్చే తన నిర్ణయాన్ని సమీక్షించుకోవాలని, ఏకపక్ష నిర్ణయానికి తప్పుడు కారణాలు చూపే తన ‘పాత అలవాటు’ను పునఃపరిశీలించుకోవాలని సూచించింది.ఇదిలాఉండ‌గా, సెప్టెంబర్‌ 7న కూడా రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్‌ ఐస్‌ల్యాండ్‌ పర్యటనకు తమ గగనతలాన్ని వినియోగించుకునేందుకు పాక్‌ నిరాకరించింది.

కాగా, జమ్ముకశ్మీర్‌ ప్రత్యేక ప్రతిపత్తి రద్దుకు నిరసనగా భారత్‌తో వాణిజ్యాన్ని బంద్‌ చేసుకోవడంతోపాటు గగనతల మార్గాల్లో మూడింటిని పాక్‌ ఇప్పటికే మూసివేసింది. తాజాగా మిగిలిన మార్గాలను కూడా మూసివేయాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇందులో తాజా నిర్ణ‌యం భాగ‌మ‌ని పేర్కొంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: