హౌడీ మోడీ కార్యక్రమం వేదికగా భారత్ పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వరాలు కురిపించబోతున్నారా...? యూఎస్‌లో జరుగుతున్న అతిపెద్ద ఈవెంట్ లో మోడీతో కలిసి పాల్గొంటున్న ట్రంప్ కీలక ప్రకటన చేయబోతున్నారట. 50 వేల మంది ప్రవాస భారతీయులు పాల్గొంటున్నహౌడీ మోడీ ప్రోగ్రామ్ రెండు దేశాల సంబంధాల్లో కీలకం కాబోతోంది. దీన్ని గ్రాండ్ సక్సెస్ చేసేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. 


HOW DO YOU DO అనే పలకరింపును అమెరికన్ లు సింపుల్ గా హౌడీ అంటారు. అందులోనుంచి వచ్చిన పేరే హౌడీ మోడీ... ఐక్యరాజ్య సమితి సమావేశాల్లో పాల్గొనేందుకు అమెరికా వెళ్తున్న మోడీ... ఈ మెగా ఈవెంట్‌కు హాజరవుతున్నారు. విదేశీ పర్యటనల్లో మోడీ ప్రవాస భారతీయులను కలవడం సాధారణంగా జరిగేదే. అయితే హౌడీ మోడీలో ఆయనతో పాటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా పాల్గోవడం విశేషం. అందుకే ఈ ప్రోగ్రామ్‌కు రెండు దేశాలు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాయి.  


టెక్సాస్ రాష్ట్రంలోని హూస్టన్‌లో వచ్చే ఆదివారం ఈ మెగా ఈవెంట్ జరుగుతుంది. భారత కాలమాన ప్రకారం రాత్రి 8.30 నుంచి 11.30 వరకు హౌడీ మోడీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. 50వేల మంది ప్రవాస భారతీయులు ఇందులో పాల్గొంటారు. పోప్ తర్వాత అమెరికాలో విదేశీ ప్రతినిధి హాజరువుతున్న అతి పెద్ద ప్రోగ్రామ్ ఇదే కావడం విశేషం. దశాబ్దాలుగా రెండు దేశాల మధ్య ఉన్న సాంస్కృతిక బంధాన్ని ఆవిష్కరించేలా హౌడీ మోడీ కార్యక్రమాన్ని డిజైన్ చేశారు. మోడీ - ట్రంప్ ప్రసంగాల కంటే ముందే... 90 నిమిషాల పాటు కల్చరల్ ప్రోగ్రామ్స్‌ను ఏర్పాటు చేశారు.


మూడు నెలల వ్యవధిలో ట్రంప్ - మోడీ కలవడం ఇది మూడో సారి. జీ 20 సమావేశం సందర్భంగా జపాన్‌లో... జీ 7 దేశాల భేటీ సందర్భంగా ఫ్రాన్స్ లో కలిశారు. ప్రధాన భారతీయులు పాల్గొంటున్న కార్యక్రమంలో మోడీతో కలిసి ట్రంప్ హాజరవడం ఇదే తొలిసారి. హౌడీ మోడీ కార్యక్రమం వేదికగా  ట్రంప్ కొన్ని కీలక ప్రకటనలు చేయబోతున్నారని సమాచారం. హూస్టన్‌లో మోడీ - ట్రంప్ కలవడానికంటే ముందే... రెండు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందాలను ఖరారు చేసుకోబోతున్నారు. ఎల్లుండి నుంచి ఈ నెల 27 వరకు మోడీ అమెరికా టూర్‌లో ఉంటారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: