ఆకాశానికి చిల్లు పడ్డట్టు...తెలుగు రాష్ట్రాలపై వరుణుడు విరుచుకుపడుతున్నాడు. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలతో పలు చోట్ల పంట నష్టం జరిగింది. ఒంగోలు, గుంటూరు, ఏలూరు నగరాలలో లోతట్టు, శివారు ప్రాంతాలు నీటమునిగాయి.


ఏపీలో అనూహ్యంగా భారీ వర్షాలు విరుచుకుపడుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి.  దీంతో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. కర్నూలు జిల్లాలో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు 15 మండలాల్లో పంట నష్టం జరిగింది. శిరువెళ్ల, రుద్రవరం, ఆళ్లగడ్డ, గోస్పాడు, చాగలమర్రి, నంద్యాల, మహానంది, బండి ఆత్మకూరు, పాణ్యం, బనగానపల్లె, కోవెల కుంట్ల, దొర్నిపాడు, ఉయ్యాలవాడ, సంజామల, బేతంచెర్ల మండలాల్లోని వరి, పత్తి, మొక్కజొన్న, మినుములు, మిరప, కందులు, పెసలు, జొన్న, కొర్ర, వేరుశనగ, టమోట, పొద్దు తిరుగుడు పంటలు నీటమునిగాయి.


ఒంగోలు, గుంటూరు, ఏలూరు నగరాలలో లోతట్టు, శివారు ప్రాంతాలు నీటమునిగాయి. పశ్చిమగోదావరి జిల్లా ఏజెన్సీలో పలు  గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వైఎస్సార్ జిల్లాలో ఆటో కొట్టుకుపోవడంతో అందులో ఉన్న దంపతులతోపాటు రెండేళ్ల చిన్నారి గల్లంతైంది. దాములూరు కూడలి కాజ్వేపై వరదనీరు ప్రవహిస్తుండటంతో నందిగామ  వీరులపాడు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. 


వైఎస్సార్ జిల్లాతోపాటు కర్నూలు, అనంతపురం జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలతో పెన్నా, కుందూ నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. జమ్మలమడుగు, కడప ప్రాంతాలకు పెద్ద ఎత్తున వరద నీరు చేరి వాగులు, వంకలు ఉప్పొంగాయి. పలు చెరువులు తెగిపోయాయి. రోడ్లు కోతకు గురయ్యాయి. కుందూ వరద ఉధృతికి అల్లాడుపల్లె దేవలాలు, కామనూరు కాజ్వేలు నీటితో మునిగాయి. బంక చిన్నాయపల్లె గ్రామం జలదిగ్బంధంలో చిక్కుకుంది. భారీ వర్షాలకు ప్రొద్దుటూరు డివిజన్ లో 150 విద్యుత్ స్థంబాలు నేలకూలాయి. 


కర్నూలు జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం మహానంది దేవాలయం వరద నీటితో నిండిపోయింది. మహానందిలోని రుద్రగుండం కోనేరులో అతిపురాతనమైన పంచలింగాల మండపంలోని ఐదు శివలింగాలు నీట మునిగిపోయాయి. గర్భాలయంలో వెలిసిన మహానందీశ్వరుడి ఎత్తు కంటే ఎక్కువ ఎత్తులో నీళ్లు రావడం చరిత్రలో ఇదే తొలిసారి. నంద్యాల పట్టణం కూడా జలదిగ్బంధంలో చిక్కుకుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: