తెలంగాణలో అధికారమే లక్ష్యంగా దూసుకెళుతున్న బీజేపీ...సరికొత్త రాజకీయ ఎత్తుగడలు వేస్తున్నట్లు కనిపిస్తోంది. మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో నాలుగు ఎంపీ సీట్లు గెలిచిన దగ్గర నుంచి బీజేపీ బాగా హడావిడి చేస్తున్న విషయం తెలిసిందే. తమకు బలం పెరిగిపోయిందని, వచ్చే ఎన్నికల్లో తమదే అధికారమని ప్రచారం చేసేసుకుంటుంది. అందుకు తగ్గట్టుగానే ఇతర పార్టీల నేతలనీ చేర్చుకుంటూ బలపడటానికి అవ్వడానికి ట్రై చేస్తోంది. ఇప్పటికే పలువురు టీడీపీ, కాంగ్రెస్ నేతలని చేర్చుకుంది కూడా.


ఈ క్రమంలోనే అధికార టీఆర్ఎస్ ని దెబ్బతీయాలని ఎప్పటి నుంచో పగతో రగిలిపోతున్న కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిపై కన్నేసినట్లు కనబడుతుంది. హఠాత్తుగా ఆయనపై సాఫ్ట్ కార్నర్ గా మాట్లాడుతుంది. ఎలాగో తాము కూడా అధికార టీఆర్ఎస్ పై దూకుడుగా వెళుతున్నాం కదా...దీనికి రేవంత్ తోడైతే మరింత బలం వస్తుందని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి బీజేపీకి రేవంత్ మీద ప్రేమ తన్నుకువస్తున్నట్లు కనిపిస్తోంది. అందుకు తాజాగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కె లక్ష్మణ్ మాట్లాడిన మాటలే ఉదాహరణగా నిలుస్తున్నాయి.


రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీపై నమ్మకం లేదని, తెలంగాణ ప్రభుత్వంలో అవినీతికి సంబంధించి రేవంత్‌రెడ్డి ఇచ్చే ఆధారాలను స్వీకరిస్తామని ఆయన వెల్లడించారు. అలాగే కాంగ్రెస్ లో జూనియర్-సీనియర్ నేతలకు పడటం లేదని ఎద్దేవా చేశారు. ఇటీవల రేవంత్ టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక ప్రాజెక్టుల్లో అవినీతి పాల్పడుతుందని విమర్శలు చేశారు. బీజేపీ నేతలు కేంద్రం సాయంతో కేసీఆర్ ప్రభుత్వంపై విచారణ చేయాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే తాజాగా లక్ష్మణ్ రేవంత్ ఆధారాలు ఇస్తే స్వీకరిస్తామని చెబుతున్నారు.


మరోవైపు రేవంత్ కు కాంగ్రెస్ లో ఉన్న సీనియర్ నేతలతో అసలు పొసగడం లేదు. పీసీసీ అధ్యక్ష పదవి విషయంలోగానీ, హుజూర్ నగర్ ఉప ఎన్నిక టికెట్ విషయంలో గానీ రేవంత్ సీనియర్ నేతలపై గుర్రుగా ఉన్నారు. అటు సీనియర్ నేతలు కూడా రేవంత్ ని తోక్కేయాలని చూస్తున్నట్లు కనిపిస్తోంది. ఇలాంటి తరుణంలో బీజేపీ రేవంత్ కు అనుకూలంగా మాట్లాడటం విశేషం.  ఆయన్ని పార్టీలో చేర్చుకోవడానికే ఇలాంటి డైలాగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. మరి చూడాలి రానున్న రోజుల్లో తెలంగాణ రాజకీయాలు ఎలాంటి మలుపులు తిరుగుతాయో.



మరింత సమాచారం తెలుసుకోండి: