కొంద‌రికి భ‌లే అవ‌కాశాలు వ‌స్తుంటాయి. దాన్ని కొంద‌రు సుడి అంటారు...ఇంకొంద‌రు గుర్తింపు అంటారు. ఇంకొంద‌రు ఆ వ్య‌క్తికి త‌గిన అవ‌కాశంగా భావిస్తుంటారు. తాజాగా...అలాంటిదే ఓ చ‌ర్చ జ‌రుగుతోంది. తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం కొత్త‌గా 24 మంది స‌భ్యుల‌తో కూడిన పాల‌క‌మండ‌లిని ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఏపీ ప్ర‌భుత్వం జారీ చేసిన ఉత్త‌ర్వుల్లో టీటీడీ బోర్డ్ ఆఫ్ ట్ర‌స్టీలో.. ఇండియా సిమెంట్స్ ఎండీ నారాయ‌ణ‌స్వామి శ్రీనివాస‌న్‌కు మూడ‌వ సారి అవ‌కాశం ఇచ్చారు.  త‌ద్వారా ఆయ‌న త‌న ప్ర‌త్యేక‌త‌ను చాటుకున్నారు. 


ప్రతిష్ఠాత్మక తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యుల జాబితాను బుధవారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదలచేసింది. మొత్తం 24 మంది సభ్యులు, నలుగురు ఎక్స్‌అఫీషియో సభ్యులతో కూడిన జాబితాతో ఉత్తర్వులు జారీచేసింది. బోర్డులో తెలంగాణ నుంచి ఏడుగురు ప్రముఖులకు అవకాశం లభించింది. ఆంధ్రప్రదేశ్ నుంచి ఎనిమిది, తమిళనాడు నుంచి నలుగురు, కర్ణాటక నుంచి ముగ్గురు.. ఢిల్లీ, మహారాష్ట్ర నుంచి ఒక్కొక్కరికి ఏపీ సర్కారు టీటీడీ పాలకమండలిలో చోటు కల్పించింది. శ్రీ‌నివాస‌న్‌కు టీటీడీ ట్ర‌స్టీ బోర్డులో మూడ‌వ సారి చోటు ద‌క్క‌డం చాలా అరుదైన విష‌య‌మే. గ‌తంలో 2004 నుంచి 2008 వ‌ర‌కు బోర్డు స‌భ్యుడిగా శ్రీనివాస‌న్ సేవ‌లందించారు. మ‌త‌ప‌ర‌మైన విష‌యాల‌కు అధిక ప్రాధాన్య‌త ఇచ్చే శ్రీనివాసన్‌కు ఈ గౌర‌వం ద‌క్క‌డం స‌ముచిత‌మే. టీటీడీ అభివృద్ధిలో శ్రీనివాస‌న్ కీల‌క పాత్ర పోషించారు.


తిరుప‌తి ల‌డ్డూ ప్ర‌సాదం ఉత్ప‌త్తిని, నాణ్య‌త‌ను పెంచ‌డంలో శ్రీనివాస‌న్ కీల‌కంగా వ్య‌వ‌హ‌రించారు. ఆయ‌న స‌భ్యుడిగా ఉన్న స‌మ‌యంలో శ్రీవారు పోటు(కిచెన్‌)లో యంత్రీక‌ర‌ణ వేగంగా జ‌రిగింది. ఆ త‌ర్వాత రోజుకు ల‌డ్డూల‌ ఉత్ప‌త్తి ల‌క్ష నుంచి 3.5 ల‌క్ష‌ల‌కు చేరుకున్న‌ది. బూందీ కిచెన్ నిర్మాణంలోనూ శ్రీనివాస‌న్ ముఖ్య‌భూమిక పోషించారు. లడ్డూ ఉత్ప‌త్తిని పెంచేందుకు బూందీ మేకింగ్ కిచెన్‌ను ఏర్పాటు చేశారు. అయితే ఆ కిచెన్ ఏర్పాటుకు కావాల్సిన మూడు కోట్ల రూపాయాల‌ను ఆయ‌నే స్వ‌యంగా ఇచ్చారు. ఆల‌య కిచెన్ నుంచి పంపిణీ చేసే కౌంట‌ర్ వ‌ర‌కు ల‌డ్డూల ర‌వాణా కోసం క‌న్వేయ‌ర్ బెల్టును ఏర్పాటు చేయ‌డంలోనూ శ్రీనివాస‌న్ ముఖ్య పాత్ర పోషించారు. గ‌తంలో ల‌డ్డూల‌ను ట్రేల‌లో తీసుకువెళ్లేవారు. దాని వ‌ల్ల మ‌హాద్వారం వ‌ద్ద ర‌ద్దీ ఏర్ప‌డేది. అయితే క‌న్వేయ‌ర్ బెల్ట్ ఏర్పాటు కోసం 1.5 కోట్లు ఇచ్చేందుకు శ్రీనివాస‌న్ ముందుకు వ‌చ్చారు. ప్ర‌స్తుతం బోర్డు పాల‌క‌మండ‌లిలో శ్రీనివాస‌న్‌కు మ‌రోసారి చోటు ద‌క్కింది. కానీ దాని క‌న్నా ముందే.. మ‌రోసారి తిరుమ‌ల శ్రీవారి ఆల‌య అభివృద్ధి కోసం భారీ ప్ర‌క‌ట‌న చేశారాయ‌న‌. అద‌న‌పు బూందీ కిచెన్ కోసం మూడు కోట్లు విరాళం ఇచ్చేందుకు శ్రీనివాస‌న్ సిద్ధ‌మ‌య్యారు. ఈ కిచెన్ ఏర్పాటుతో ల‌డ్డూల ఉత్ప‌త్తి రోజుకు 7 ల‌క్ష‌ల వ‌ర‌కు చేరుకోనుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: