కేంద్ర హోంమంత్రి, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా మ‌రోమారు క‌ల‌క‌లం సృష్టించారు. జార్ఖండ్‌ రాజధాని రాంచీలో హిందుస్థాన్‌ టైమ్స్‌ మీడియా గ్రూప్‌కు చెందిన హిందీ పత్రిక హిందుస్థాన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘పూర్వోదయ్‌ హిందుస్థాన్‌' కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ  తమ ప్రభుత్వం దేశవ్యాప్తంగా జాతీయ పౌర జాబితాను (ఎన్నార్సీ) అమలు చేస్తుందని  పేర్కొన్నారు. ఇందుకోసం త్వరలో కార్యాచరణ ప్రారంభిస్తుందన్నారు. చట్టవిరుద్ధంగా నివసిస్తున్న విదేశీయులను గుర్తించడానికి దేశమంతటా ఎన్నార్సీని అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు.


గత నెలాఖరుతో అసోంలో ఎన్నార్సీ ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో ఆయన ఆస‌క్తిక‌ర‌ వ్యాఖ్యలు చేశారు. ‘అమెరికా, బ్రిటన్‌, రష్యాల్లో ఒక్క భారతీయుడైనా చట్ట విరుద్ధంగా నివసించగలడా? లేదు. ఎటువంటి చట్టపరమైన పత్రాలు లేకుండా భారత్‌లో ఇతర దేశీయులు ఎలా జీవిస్తారు? అందుకే దేశమంతటా ఎన్నార్సీని అమలు చేయాలి’ అని చెప్పారు. మరోవైపు జంతారాలో ‘జోహార్‌ జన్‌ ఆశీర్వాద్‌ యాత్ర’ను అమిత్‌షా ప్రారంభిస్తూ జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేకప్రతిపత్తి కల్పించే 370, 35ఏ అధికరణాలను రద్దు చేయడం ద్వారా భారత్‌లో కశ్మీర్‌ అంతర్భాగమని స్పష్టం చేయడమే గాక, పాకిస్థాన్‌కు తన స్థానం ఏమిటో ప్రధాని మోదీ తెలియజేశారన్నారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే మహారాష్ట్ర, జార్ఖండ్‌, హర్యానా రాష్ర్టాల్లో పర్యటించనున్న కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు రాహుల్‌గాంధీ.. 370 అధికరణం రద్దుపై ఆయన పార్టీ వైఖరిని ప్రజలకు చెప్పాలన్నారు. 370 అధికరణం రద్దుపై కాంగ్రెస్‌ పార్టీకి కడుపునొప్పి ఎందుకని నిలదీశారు. ఇంతకుముందు పాక్‌పై జరిపిన లక్షిత దాడులను వ్యతిరేకించిన కాంగ్రెస్‌ పార్టీ.. వాటికి కూడా ఆధారాలు కావాలని కోరిందని అమిత్‌షా ధ్వజమెత్తారు.


దేశమంతా ఒకవైపు వెళుతుంటే కాంగ్రెస్‌ పార్టీ మరో దిశలో పయనిస్తున్నదన్నారు. తాము విపక్షంలో ఉన్నప్పుడు ముఖ్యమైన అంశాలపై ప్రభుత్వానికి మద్దతునిచ్చినట్లు తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ సారథ్యంలోని యూపీఏ ప్రభుత్వం.. జార్ఖండ్‌ రాష్ట్ర అభివృద్ధికి చేపట్టిన చర్యలేమిటో చెప్పాలని అమిత్‌షా అన్నారు. ‘కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో రఘువర్‌దాస్‌ ప్రభుత్వాల హయాంలో జార్ఖండ్‌ రూపురేఖలు మార్చేశారు. దాని ఫలితమే గత లోక్‌సభ ఎన్నికల్లో 14 స్థానాలకు 12 చోట్ల బీజేపీ గెలుపొందింది. గతంలో నక్సలిజం సమస్య ఉండేది. కానీ ప్రస్తుతం అభివృద్ధి దిశగా ప్రయాణిస్తూ నక్సల్స్‌ రహిత రాష్ట్రంగా ముందుకు వెళుతున్నది’ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో జార్ఖండ్‌ సీఎం రఘువర్‌దాస్‌, కేంద్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి అర్జున్‌ముండా, బీహార్‌ మంత్రి నంద్‌ కిశోర్‌ యాదవ్‌ పాల్గొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: