వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 1వ తేదీ నుండి 8వ తేదీ వరకు గ్రామ, వార్డు సచివాలయ పరీక్షలు జరిగాయి. సచివాలయ రాత పరీక్షలకు 19,50,582 మంది అభ్యర్థులు హాజరు కాగా 1,98,164 మంది అభ్యర్థులు కనీస అర్హత మార్కులు సాధించారు. అర్హత మార్కులు తెచ్చుకున్న వారిలో సగానికి పైగా బీసీ అభ్యర్థులు ఉండటం విశేషం. 
 
అధికారులు ఇప్పటికే జిల్లాల వారీగా మెరిట్ జాబితాలను ఆయా ప్రాంతాలకు పంపటం జరిగింది. జిల్లా సెలక్షన్ కమిటీలు జిల్లాలో ఉన్న పోస్టుల సంఖ్య మరియు రిజర్వేషన్ల ఆధారంగా అభ్యర్థులకు కాల్ లెటర్లను పంపిస్తాయి. ఎంపికైన వారు ఒరిజినల్ సర్టిఫికెట్లను స్కాన్ చేసి వెబ్ సైట్లో అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. జిల్లా యంత్రాంగం నిర్దేశించిన చోట 23, 24, 25 తేదీలలో సర్టిఫికెట్ల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థులు హాజరు కావాల్సి ఉంటుంది. 
 
సచివాలయ ఉద్యోగాల భర్తీ విషయంలో నోటిఫికేషన్ లో విడుదలైన ఉద్యోగాల కన్నా తక్కువ మంది అభ్యర్థులు ఎంపికైతే కనీస అర్హత మార్కులు తగ్గించే అవకాశం ఉందని కొన్ని రోజుల క్రితం వెబ్ సైట్లో పొందుపరిచారు. కానీ సచివాలయ ఉద్యోగాల భర్తీ విషయంలో అర్హత మార్కుల తగ్గింపు గురించి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. 
 
అధికారులు రాత పరీక్షలలో కొన్ని జిల్లాలలో కనీస అర్హత మార్కులు సాధించిన వారు తక్కువ సంఖ్యలోనే ఉన్నారని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 15 రోజుల తరువాత ప్రభుత్వం ఒక నిర్ణయం వెలువరించే అవకాశం ఉందని ద్వివేది తెలిపారు. అర్హత మార్కులు తెచ్చుకున్న వారికి మాత్రమే జిల్లా సెలక్షన్ కమిటీలు కాల్ లెటర్లు పంపటం జరుగుతుందని ద్వివేది చెప్పారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: