మన నిత్య జీవితంలో కీలకంగా మారిన వాటిలో స్మార్ట్ ఫోన్లు కూడా ఒకటి. స్మార్ట్ ఫోన్లు కాల్స్, సందేశాల కొరకు మాత్రమే కాక సరికొత్త ఫీచర్లను కలిగి ఉంటాయి. ఆర్థిక లావాదేవీల కోసం కూడా స్మార్ట్ ఫోన్లను ఉపయోగించవచ్చు. స్మార్ట్ ఫోన్లలో ఉండే యాప్స్ ఉపయోగించి ఎన్నో పనులను చేయవచ్చు. పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం గతంలో జరిగిన ఎన్నికల్లో యువతకు స్మార్ట్ ఫోన్లను ఇస్తామని హామీ ఇచ్చింది. 
 
ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు పంజాబ్ ప్రభుత్వం రాష్ట్రంలోని యువతకు స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేయాలన్న నిర్ణయానికి పంజాబ్ రాష్ట్ర మంత్రి మండలి ఆమోద ముద్రను వేసింది. నిన్న సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ అధ్యక్షతన డేరా బాబా నానక్ అనాజ్ మండీ వద్ద మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో యువతకు స్మార్ట్ ఫోన్లు ఇవ్వటానికి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. 
 
దశల వారీగా డిసెంబర్ నెల నుండి స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేయబోతున్నారని తెలుస్తుంది. ఒక ప్రభుత్వ అధికారి తెలిపిన వివరాల ప్రకారం మొదట ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ స్మార్ట్ ఫోన్లు లేని 11, 12 తరగతుల విద్యార్థినులకు స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేయబోతున్నారని సమాచారం. సరికొత్త ఫీచర్లు ఈ స్మార్ట్ ఫోన్లలో ఉండబోతున్నాయని తెలుస్తుంది. సోషల్ మీడియా అప్లికేషన్లు, కెమెరా, టచ్ స్క్రీన్ ఈ ఫోన్లలో ఉంటాయని తెలుస్తోంది. 
 
ప్రభుత్వం అందించే స్మార్ట్ ఫోన్ల కోసం బహిరంగ వేలం ద్వారా కంపెనీలను ఎంపిక చేయటం జరుగుతుంది. యువత కొత్త నైపుణ్యాలు నేర్చుకోవాలనే లక్ష్యంతో పాటు విద్య, ఉద్యోగాల గురించి సమాచారం తెలుసుకోవటం కొరకు, పంజాబ్ రాష్ట్రంలో సాంకేతికతను మరింతగా విస్తరించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేరుస్తూ ఉండటం పట్ల పంజాబ్ యువత సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 




మరింత సమాచారం తెలుసుకోండి: