కేవ‌లం పర్యాటక శాఖ నిర్లక్ష్యం వ‌ల్లే ఇదంతా జ‌రిగింది. కలసి వెరసి నిండు ప్రాణాలను బలితీసుకున్నాయి. విహార యాత్రకు వెళ్లిన డజన్ల మంది జీవితాలు విషాదాంతం కావడానికి కచ్చితంగా ప్రభుత్వమే కారణం. ఎక్కువమంది ఎక్కినందున మృతి చెందిన దానికి, ప్రభుత్వానికి ఏం సంబంధమన్న ప్రశ్న ఈ సందర్భంగా ఎదురుకావచ్చు. కానీ.. వరద ఉధృతిలో అసలు బోటును విహారయాత్రకు అనుమతించడమే ఈ విషాదానికి మూలమన్నదే ఆ ప్రశ్నలకు సమాధానం.


ప్రైవేటు బోట్ల యాజమాన్యాలు దేవీపట్నం గోదావరి పై తీవ్ర వరదల సమయంలోనూ విహారయాత్రలకు ఇష్టారాజ్యంగా బోట్లను తిప్పి, నాలుగుచేతులా సంపాదిస్తుంటే.. వాటిని నిలువరించాల్సిన పర్యాటక శాఖ, రెవిన్యూ అధికారులు మామూళ్లకు కక్కుర్తి పడి, డజన్ల మంది మరణాలకు కారణమయ్యారన్నది నిష్ఠుర నిజం.


 గతంలో మంటూరు-వాడపల్లి మధ్య లాంచి మునిగి 19 మంది చనిపోయిన అనుభవాన్ని గమనంలోకి తీసుకోని అధికారులు.. తీవ్రమైన వరద ఉథృతి, అందులోనూ సమీపంలోని దాదాపు 36 గ్రామాలు ఇంకా జల దిగ్బంధంలోనే మునిగిఉన్న సమయంలో.. ఒక బోటులో 50 మందిని ఎలా అనుమతించారన్న ప్రశ్నకు ఎవరి నుంచీ సమాధానం లేకపోవడం బట్టి... పర్యాటక శాఖ అధికారులు ప్రైవేటు బోటు ఆపరేటర్ల వద్ద ఏ స్థాయిలో తెగి తిన్నారో స్పష్టమవుతూనే ఉంది.


గతంలో జరిగిన బోటు ప్రమాదం తర్వాతయినా సర్కారు కళ్లు తెరవకపోవడం అధికారుల అహంకారం, నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనం. అప్పట్లో ఆ ప్రమాదం జరిగిన తర్వాత పడవల రాకపోకల అనుమతులు పశ్చిమ గోదావరి జిల్లా అధికారులే ఇస్తున్నారు. అసలు ఇప్పుడు నదీ విహారం నిషేధంలో ఉన్నప్పటికీ, వాటికి అనుమతులు ఎలా వచ్చాయి? ఎవరు ఇచ్చారు? అన్నదే ప్రశ్న. 


పోచ‌మ్మ గుడి నుంచి పేరంటాలపల్లి వరకూ పాపికొండల విహారానికి అనుమతులు జారీ చేస్తున్న వారిపై ఏం చర్యలు తీసుకుంటారన్నదే ప్రశ్న. అసలు పర్యాటక శాఖ అధికారులు ఇక్కడ ఇలాంటి ధిక్కార చర్యలను ప్రోత్సహిస్తున్నారంటూ, కొన్ని రోజులుగా మీడియాలో వార్తలు వస్తున్నా వాటిని బేఖాతరు చేయకపోవడం మరో నేరం! 
. ముఖ్యమంత్రి జగన్ పర్యటనలు, సానుభూతి ప్రకటనలు, ఆర్ధిక సహాయం ఇవన్నీ పోయిన ప్రాణాలను బతికించలేకపోయినా, కనీసం క్షతగాత్రులయి, సాయం కోసం ఎదురుచూస్తున్న వారిని బతికిస్తే అదే పదివేలు.


 ఇక పరాచక శాఖగా మారిన పర్యాటకశాఖ అధికారుల నిర్లక్ష్యానికి కచ్చితంగా శిక్షలు పడాల్సిందే. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన భారీ విషాద ఘటన ఇది.  అడ్డగోలు, బేఖాతరిజాన్ని కఠినంగా అణచివేసేందుకు నడుంబిగిస్తే.. కనీసం భవిష్యత్తులోనయినా ఇటువంటి ప్రాణ నష్టాలు నివారించవచ్చన్నది కొంద‌రి అభిప్రాయం.


మరింత సమాచారం తెలుసుకోండి: