ఈనెల 24న తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం కానున్నారు.  కృష్ణా, గోదావరి నదుల అనుసంధానంపై ఇరువురు సీఎంలు చర్చించనున్నారు. ఇప్పటికే ఉమ్మడి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రులు ఇద్దరూ చర్చించారు. తాజాగా విభజన సమస్యలపై ఇద్దరు సీఎంల మధ్య చర్చ జరగనుంది. 


తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మరోసారి సమావేశమయ్యేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 24న ఇద్దరు సీఎంలు వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి, కేసీఆర్‌లు.. హైదరాబాద్‌లో భేటీ కానున్నారు. ఇప్పటికే ఉమ్మడి రాష్ట్రాల ప్రాజెక్టులపై చర్చించిన ముఖ్యమంత్రులు.. తాజాగా నదుల అనుసంధానంపై చర్చించనున్నారు. సీఎంలతోపాటు పలువురు మంత్రులు, అధికారులు ఈ భేటీకి హాజరుకానున్నారు. గతంలో సమావేశమైనప్పుడు...విభజన సమస్యలతో పాటూ ఇరిగేష్ ప్రాజెక్టులు, నీటి పంపకాలపై చర్చించారు. 


గోదావరి జలాలను  శ్రీశైలానికి ఎలా తరలించాలనే అంశంపై ఈ భేటీలో ప్రధానంగా చర్చిస్తారని తెలుస్తోంది. రెండు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా వున్న విభజన అంశాలపై ఉభయులూ చర్చించే అవకాశం ఉంది. గతంలో గోదావరి నీటిని శ్రీశైలం జలాశయానికి తరలించే వ్యూహం ఖరారు చేయాలని ఓ కమిటీని ఏర్పాటు చేశారు. ఇరు రాష్ట్రాల అధికారులు, ఇంజినీర్లకు ఇందులో అవకాశం కల్పించారు. ఎక్కడి నుంచి ఎలా నీరు తరలించాలన్న విషయంపై నివేదిక ఇవ్వాలని కమిటీని ఆదేశించారు. ఐతే తెలంగాణ భూభాగం నుంచి గోదావరి నీటిని తరలించాలని ఏపీ ఇంజనీర్లు, ఏపీలో మరో రిజర్వాయర్ నిర్మాణం చేస్తూ.. కాల్వలను వెడల్పు చేయడం ద్వారా నీటిని నాగార్జునసాగర్, అక్కడి నుంచి శ్రీశైలం తరలించవచ్చునని తెలంగాణ అధికారులు వేర్వేరు ప్రతిపాదనలు రూపొందించారు. ఒకరి ప్రతిపాదనలు ఒకరికి నచ్చకపోవడంతో ఈ అంశం అప్పటికి ఆగిపోయింది. దీనిపై ఇప్పుడు కేసీఆర్ పట్టుబడుతున్నట్టు సమాచారం.  


 ప్రాజెక్టు పూర్తి కాకుండానే కాళేశ్వరం ప్రాజెక్టును హడావుడిగా ప్రారంభించారని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తుండటంతో గోదావరి జలాలను దిగువ రాష్ట్రంతో ఇబ్బంది లేకుండా తెలంగాణాకు పూర్తిగా మళ్లించే ఆలోచనతో కేసీఆర్  వున్నారని అంటున్నారు. ఏపీ భూభాగంలో పట్టిసీమ నిర్మాణానికే గతంలో అనవసరమని రాద్ధాంతం చేసిన వైసీపీ నేత వేరే రాష్ట్ర భూభాగం నుంచి రెండు నదుల అనుసంధానం చేయడానికి రెండు రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టుగా దీన్ని ఎలా చేపడతారని టీడీపీ నిలదీస్తోంది. మొత్తం మీద మరో వివాదానికి సంబంధించిన వ్యవహారంపై ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రులు 24న జరగనున్న సమావేశంలో ఏం నిర్ణయం తీసుకుంటారన్నదానిపై ఆసక్తి నెలకొంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: