కోల్‌కతా జాధవ్‌పూర్ యూనివర్సిటీలో కేంద్ర మంత్రి బాబుల్‌ సుప్రియోకు చేదు అనుభవం ఎదురైంది. విశ్వవిద్యాలయంలో మంత్రిని విద్యార్థులు అడ్డుకోవడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. స్టూడెంట్స్‌ జుట్టుపట్టుకొని తోసేశారంటూ మంత్రి వాపోయారు. ఈ మొత్తం ఘటనపై విచారణ జరుపుతున్నారు వైస్ ఛాన్స్‌లర్.


కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ సహాయమంత్రి రాకతో కోల్‌కతాలోని జాధవ్‌పూర్‌ యూనివర్సిటీ ఉద్రిక్తంగా మారింది. ఏబీవీపీ నిర్వహించిన సెమినార్‌కు హాజరయ్యేందుకు వెళ్లిన కేంద్రమంత్రి బాబుల్‌ సుప్రియోను ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్తలు అడ్డుకున్నారు. గో బ్యాక్‌ అంటూ నినాదాలు చేశారు. నల్ల జెండాలు ప్రదర్శిస్తూ... ఆయన్ను అడ్డగించారు.  ఐతే కొంత మంది లెఫ్ట్‌ కార్యకర్తలు తనపై దాడి చేశారని ఆరోపిస్తున్నారు బాబుల్‌ సుప్రియో. తన జుట్టు పట్టుకొని లాగారాని, తాను ఇదంతా ఊహించలేదన్నారు. 


ప్రాంగణంలోకి అడుగుపెట్టిన వెంటనే ఆయన్ను వందలాది మంది వామపక్ష భావజాల విద్యార్థి సంఘం నాయకులు చుట్టుముట్టారు. దీంతో తోపులాట చోటుచేసుకుంది. ఈ క్రమంలో మంత్రి సెక్యూరిటీ సిబ్బంది తుపాకులు కూడా కింద పడిపోయాయి.  యూనివర్సిటీ ఉప కులపతి కలగజేసుకున్నా ఫలితం లేకపోయింది. విషయం తెలుసుకున్న బెంగాల్‌ గవర్నర్‌... జాధవ్‌పూర్‌ యూనివర్సిటీ వెళ్లి కేంద్రమంత్రిని సేఫ్‌గా బయటకు తీసుకొచ్చారు. ఈ ఘటనపై వెంటనే విచారణ చేపట్టాల్సిందిగా యూనివర్సిటీ వీసీ, బెంగాల్‌ సీఎస్‌ను ఆదేశించారు. ఇటు ముఖ్యమంత్రికి కూడా ఆర్డర్స్‌ జారీ చేశారు గవర్నర్‌. 


మూడు నాలుగు గంటలు మంత్రి వర్సిటీలోనే ఉండిపోయారు. నిరసనకారులు విద్యార్థులను రెచ్చగొట్టి ప్రశాంతమైన ప్రాంగణంలో తొక్కిసలాట సృష్టించారని బాబుల్ ఆరోపించారు. నిరసన చేస్తున్నవారు తమకు తాము నక్సల్స్‌ అని చెప్పుకున్నారని మంత్రి అన్నారు. బాబుల్  తిరిగి  వెళ్లిపోయేటప్పుడు కూడా ఆందోళనే ఎదుర్కొన్నారు. ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరిపి గవర్నర్‌కు నివేదిక అందజేస్తామన్నారు యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ సురంజన్ దాస్. 

మరింత సమాచారం తెలుసుకోండి: