పీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మ‌ల్కాజ్‌గిరి ఎంపీ అనుముల రేవంత్‌రెడ్డిపై పీసీసీ క్ర‌మశిక్ష‌ణ క‌మిటీ సీరియ‌స్ అయిన‌ట్లు స‌మాచారం. కాంగ్రెస్ వ‌ర్కింగ్ క‌మిటీ అధ్య‌క్షుడుగా ఉన్న రేవంత్‌రెడ్డి ఇటీవ‌ల పీసీసీ అధ్యక్షుడు ఉత్త‌మ్ కుమార్‌రెడ్డిపై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు కురిపించారు. కాంగ్రెస్‌లో గ్రూపు త‌గాదాల‌కు ఏనాడు కొదువ లేదు. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉత్త‌మ్ కుమార్ రెడ్డిని విమ‌ర్శించ‌గానే అగ‌మేఘాల మీద పీసీసీ క్ర‌మ‌శిక్ష‌ణ క‌మిటీ రంగంలోకి దిగ‌డం చూస్తుంటే కాంగ్రెస్‌లో రేవంత్ రెడ్డికి ఎస‌రు పెట్టె ప‌నులు షురూ అయ్యాయ‌నే ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి.


రేవంత్ రెడ్డి టీడీపీలో చిన్న వ‌య‌స్సులోనే డైన‌మిక్ లీడ‌ర్‌గా ఎదిగారు. చిన్న‌వ‌య‌స్సులోనే టీడీపీ ఆధినేత చంద్రబాబు నేతృత్వంలో ఎమ్మెల్యేగా ఎన్నికై రికార్డు సృష్టించాడు. మాట‌కారి త‌నం, ఎవ‌రినైనా ఎదిరించే త‌త్వం, ముక్కుసూటి త‌నం, న‌మ్మిన నేత‌కు బ‌ద్దుడై ప‌నిచేయ‌డం, చెప్పిన ప‌ని ఎంత క‌ష్ట‌మైనా చేయ‌డం రేవంత్‌రెడ్డి నైజం. అలా దుందుకు స్వ‌భావ‌మే రేవంత్‌రెడ్డిని అన‌తికాలంలోనే టీడీపీలో కీల‌క నేత‌గా త‌యారు చేసింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం విడిపోవ‌డంతో రేవంత్‌రెడ్డి టీడీపీ కార్య‌నిర్వ‌హ‌క అధ్య‌క్షుడిగా మారాడు.


త‌రువాత తెలంగాణ‌లో టీడీపీ ప‌త‌నం అంచున్న ఉన్న స‌మ‌యంలో త‌ప్ప‌ని ప‌రిస్థితిలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నాడు. కాంగ్రెస్‌లోనూ డైన‌మిక్ లీడ‌ర్‌గా కార్య‌కర్త‌ల చేత జేజేలు అనిపించుకుంటున్న త‌రుణంలో విబేధాలు ముదిరాయి.. ఇంత‌లోనే ఏఐసీసీలో త‌న‌కైన వ‌ర్గం ఉండ‌టంతో పీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియ‌మితులైన రేవంత్‌రెడ్డి త‌రువాత జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌లో ఘోరంగా ఓడిపోయాడు. ఇక పార్లమెంట్ ఎన్నిక‌ల్లో మ‌ల్కాజ్‌గిరి నుంచి ఎంపీగా పోటీచేసి విజ‌యం సాధించాడు. దీంతో రేవంత్ రెడ్డి కి పార్టీలో ప్రాధాన్య‌త పెరిగిపోయింది. అయితే ఇటీవ‌ల ఏఐసీసీ పీసీసీ అధ్య‌క్షుడు ఉత్త‌మ్ కుమార్ రెడ్డిని మార్చి, రేవంత్‌రెడ్డికి పీసీసీ అధ్య‌క్ష ప‌ద‌వి ఇస్తార‌నే ప్ర‌చారం జ‌రిగింది.


అయితే ఉత్త‌మ్ కుమార్ రెడ్డి చ‌క్రం తిప్పి త‌న ప‌ద‌వికి ఎస‌రు రాకుండా కాపాడుకుంటూనే ఉన్నాడు. అయితే ఇప్పుడు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి రాజీనామా చేయ‌డంతో ఉప ఎన్నిక‌కు వేధికైన హూజూర్‌న‌గ‌ర్ అభ్య‌ర్థి ఎంపిక కాంగ్రెస్‌లో క‌య్యాల‌కు కార‌ణ‌మైంది. ఇప్ప‌టికే కాంగ్రెస్‌లో ఉన్న గ్రూపు రాజ‌కీయాల‌కు తోడు హూజూర్‌న‌గ‌ర్ అభ్య‌ర్థి ఎంపిక కాంగ్రెస్ రెండు ముక్క‌లు అయింది. ఉత్త‌మ్ కుమార్ రెడ్డి త‌న భార్య ప‌ద్మావ‌తిని హూజూర్‌న‌గ‌ర్ అభ్య‌ర్థిగా స్వ‌యంగా ప్ర‌క‌టించుకోవ‌డంతో రేవంత్‌రెడ్డి వ్య‌తిరేకించి త‌న అభ్య‌ర్థి అంటూ కిర‌ణ్‌రెడ్డిని రంగంలోకి తెచ్చాడు. ఇది కాంగ్రెస్‌లో ర‌చ్చ‌కు దారీ తీసింది.


రేవంత్‌రెడ్డి సొంతంగా అభ్య‌ర్థిని ఎంపిక చేసుకోవ‌డ‌మే కాకుండా ఉత్త‌మ్ కుమార్ రెడ్డిపైన విమ‌ర్శ‌లు కురిపించాడు. దీంతో కాంగ్రెస్ అభ్య‌ర్థి ఎంపిక అటుంచి రేవంత్ రెడ్డికి ఎస‌రు తెచ్చేందుకు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి వ‌ర్గీయులు పావులు క‌దుపుతున్నార‌ని కాంగ్రెస్‌లో గుస‌గుస‌లు వ‌నిపిస్తున్నాయి. ఇప్పుడు రేవంత్‌రెడ్డిని అడ్డుకుంటే అటు పీసీసీ ప‌ద‌వి సేఫ్‌గా ఉంటుంద‌ని, త‌న భార్య‌ను హూజూర్‌న‌గ‌ర్ అభ్య‌ర్థిగా ఎంపిక చేసుకోవ‌చ్చు.. కాంగ్రెస్‌లో తాను ఆడింది ఆట‌.. పాడింది పాట‌గా మారుతుంద‌ని గ్ర‌హించిన ఉత్త‌మ్ కుమార్ రెడ్డి పీసీసీ క్ర‌మశిక్ష‌ణ సంఘంను రంగంలోకి దింపాడ‌ట‌.


రేవంత్ రెడ్డిపై చ‌ర్య‌లు తీసుకునేందుకు పీసీసీ క్ర‌మ శిక్ష‌ణ సంఘం సీరియ‌స్‌గా ఆలోచిస్తుంద‌ట‌. అయితే ఎంపీగా ఉన్న రేవంత్‌రెడ్డిపై చ‌ర్య‌లు తీసుకోవాలంటే ఏఐసీసీ అభిప్రాయం తీసుకోవాల‌ని ఆలోచ‌న చేస్తుంద‌ట‌. సో ఇప్పుడు రేవంత్‌రెడ్డిపై పైచేయి సాధించే ప‌నిలో ఉత్త‌మ్ వ‌ర్గీయులు క్ర‌మ‌శిక్ష‌ణ సంఘాన్ని ఉసిగొల్పారా అనే అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. సో రేవంత్‌రెడ్డిపై క్ర‌మ‌శిక్ష‌ణ చ‌ర్య‌లు తీసుకునేందుకు ఏఐసీసీ నుంచి గ్రీన్ సిగ్న‌ల్ పొందుతారా లేదా అనేది వేచి చూడాల్సిందే..



మరింత సమాచారం తెలుసుకోండి: