ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలోకి వచ్చి వందరోజులు దాటింది. ఈ వంద రోజుల్లో సీఎం జగన్ దూకుడుగా...పాలనలో తనదైన ముద్రవేసుకుంటూ ముందుకు వెళుతున్నారు. జగన్ తో పాటు మంత్రులు కూడా కష్టపడుతూ...పాలన వ్యవహారాల్లో చురుగ్గా ఉంటున్నారు. తమ శాఖలపై పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తూ, జగన్ తీసుకున్న కీలక నిర్ణయాలని సజావుగా అమలు చేస్తున్నారు. అయితే కేబినెట్ లోని కొందరు మంత్రులు మాత్రమే తమ శాఖలపై పట్టు సాధించినట్లు కనబడుతోంది. అందులో కీలకమైన దేవాదాయ శాఖ మంత్రిగా ఛాన్స్ కొట్టేసిన వెల్లంపల్లి శ్రీనివాస్....తన శాఖపై పూర్తిగా గ్రిప్ దొరకబుచ్చుకున్నారనే చెప్పొచ్చు.


విజయవాడ వెస్ట్ నుంచి రెండో సారి ఎమ్మెల్యేగా గెలిచిన వెల్లంపల్లి....తొలిసారి మంత్రి అయ్యే అవకాశాన్ని దక్కించుకున్నారు. ఆర్యవైశ్య సామాజికవర్గానికి చెందిన వెల్లంపల్లికి...జగన్ నమ్మకంతో దేవాదాయ శాఖ బాధ్యతలు అప్పగించారు. ఇక వెల్లంపల్లి మంత్రిగా రావడం రావడమే దేవాలయాల్లో పాత పాలక మండళ్ళని తొలగించి...కొత్తవారిని నియమించారు. అలాగే రాష్ట్రంలో ప్రతి పెద్ద దేవాలయాలని సందర్శించి...అక్కడ స్థితిగతులని తెలుసుకుని వాటి అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.


అలాగే టీటీడీ బస్సుల్లో టికెట్లపై జెరూసలేం యాత్రకు సంబంధించిన అన్యమత ప్రచారం జరగడపై ఆరోపణలు వస్తే వాటిని సమర్ధవంతంగా తిప్పికొట్టారు. గత టీడీపీ ప్రభుత్వం హయాంలోనే ఆ టికెట్లు ముద్రించబడ్డాయనే విషయాన్ని బయటకు తెచ్చారు. అటు దేవాలయాల్లో అన్యమత ఉద్యోగులు ఉన్నారంటూ వస్తున్న ఆరోపణలకు చెక్‌ పెట్టారు. దేవాదాయ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులంతా తాము హిందూ మతాన్ని విశ్వసిస్తున్నట్టుగా అఫిడవిట్ ఇవ్వాలని ప్రభుత్వం తరుపున ఆదేశాలు జారీ చేసేలా చేశారు. అన్యమత ప్రచారంపై కూడా ప్రత్యేక కమిటీలు నియమించి చర్యలు తీసుకున్నారు.


ఇక గత ప్రభుత్వాలకు భిన్నంగా ఈసారి దసరా ఉత్సవాల ఖర్చుని ప్రభుత్వమే భరిస్తుందని సరికొత్త నిర్ణయం తీసుకున్నారు. అలాగే అధికార పార్టీ నేతగా..ప్రతిపక్ష టీడీపీ చేసే విమర్శలకు గట్టిగానే కౌంటర్లు ఇచ్చారు. అలాగే నియోజకవర్గంలో సమస్యలు పరిష్కరించడంలో ముందున్నారు. మొత్తం మీద వెల్లంపల్లి వందరోజుల పాలన కాలంలో సరికొత్త నిర్ణయాలు తీసుకుంటూ… తన శాఖ మీద గ్రిప్ సాధించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: