ఆ ఇద్దరు ఉమ్మడి ఏపీలో చక్రం తిప్పిన తెలంగాణ నేతలు...వేరు వేరు పార్టీల్లో ఉంటూనే...తమకంటూ ఒక ఇమేజ్ తెచ్చుకున్నారు. తమ పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించారు. అలా ఒక్కప్పుడు ఒక వెలుగు వెలిగిన నేతలు ఇప్పుడు కంటికి కనిపించడంలేదు. అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. ఇంతకి ఆ నేతలు ఎవరో కాదు ప్రస్తుతం అధికార టీఆర్ఎస్ లో కొనసాగుతున్న నిజామాబాద్ జిల్లా నేతలు మండవ వెంకటేశ్వరరావు, కేఆర్ సురేశ్ రెడ్డిలు.


మండవ టీడీపీలో కీలక నేతగా వ్యవహరించారు. ఉమ్మడి ఏపీలో మంత్రిగా కూడా పని చేశారు. అలా టీడీపీలో ఎదిగిన మండవ తెలంగాణ ఏర్పాడ్డాక 2014 ఎన్నికల్లో పోటీ చేయకుండా రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అయితే 2018 అసెంబ్లీ ఎన్నికల ముందు బయటకొచ్చి టీడీపీకి మద్ధతు ఇచ్చారు. ఎన్నికల్లో కాంగ్రెస్ తో జతకట్టిన టీడీపీ ఘోరంగా ఓడిపోవడంతో మళ్ళీ సైలెంట్ అయిపోయారు.


ఇక లోక్ సభ ఎన్నికల ముందు సీఎం కేసీఆర్ వ్యూహాత్మకంగా కుమార్తె కవితా గెలుపు కోసం మండవని కలిసి పార్టీలోకి తీసుకొచ్చారు. అటు కాంగ్రెస్ లో సీనియర్ నేతగా ఉన్న మాజీ స్పీకర్ సురేశ్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల ముందు టీఆర్ఎస్ లో చేరారు. ఇక వీరికి కేసీఆర్ మంచి పదవులే ఇస్తారని ప్రచారం జరిగింది. ఒకరికి మండలి చైర్మన్ పదవి, మరొకరికి మంత్రి పదవి ఇస్తారని వార్తలు వచ్చాయి. అందుకే పార్టీ కోసం, నిజామాబాద్ లో కేసీఆర్ కుమార్తె కవిత గెలుపు కోసం ఈ ఇద్దరు బాగానే కష్టపడ్డారు.


కానీ అనూహ్యంగా కవిత ఓడిపోవడంతో...వీరి రాజకీయ భవిష్యత్తుకు ఎండ్ కార్డ్ పడిపోయిందనిపిస్తోంది. ఒకవేళ కవిత గెలిచి ఉంటే వీరి భవిష్యత్ వేరేగా ఉండేదని టీఆర్ఎస్ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే రెండోసారి మంత్రివర్గ విస్తరణ చేసేశారు. అటు మండలి ఛైర్మన్ ని కూడా నియమించేశారు. దీంతో వీరికి పదవులు వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. ఏది ఏమైనా కవిత ఓటమి వీరి కొంపముంచిందనే చెప్పొచ్చు.



మరింత సమాచారం తెలుసుకోండి: