అనంత‌పురం జిల్లాలోని కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం తాడిప‌త్రి. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో మూడున్నర ద‌శాబ్దాలుగా జేసీ దివాక‌ర్ రెడ్డి ప్ర‌భ వెలిగింది. కాంగ్రెస్ త‌ర‌ఫున 1985లో ఇక్క‌డ తొలిసారి విజ‌యం సాధించిన జేసీ దివాక‌ర్ రెడ్డి 2014 ఎన్నిక‌ల వ‌ర‌కు అప్ర‌తిహ‌త విజ‌యాల‌ను న‌మోదు చేసుకున్నారు. ఒకే పార్టీ ఇక్క‌డ విజ‌యం సాధించింది. 2014లో రాష్ట్ర విభ‌జ‌న నేప‌థ్యంలో కాంగ్రెస్ పార్టీపై ప్ర‌జ‌లు ఆగ్ర‌హం పెంచుకోవ‌డంతో జేసీ దివాక‌ర్ రెడ్డి వ‌ర్గం పార్టీ మారిపోయింది. వైసీపీలోకి వెళ్లాలా?  టీడీపీలోకి వెళ్లాలా? అనే మీమాంస ఏర్ప‌డిన‌ప్పుడు.. టీడీపీ వైపే మొగ్గు చూపారు. ఆ పార్టీ అదినేత చంద్ర‌బాబు కూడా వీరికి ఆహ్వానం ప‌ల‌కడంతోపాటు తాడిప‌త్రి టికెట్‌ను జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డికి, అనంత‌పురం ఎంపీటికెట్‌ను జేసీ దివాక‌ర్‌రెడ్డికి ఇచ్చారు. ఈ ఇద్ద‌రూ ఆ ఎన్నిక‌ల్లో అప్ర‌తిహ‌త విజ‌యం న‌మోదు చేశారు.


అయితే, గ‌డిచిన ఐదేళ్ల కాలంలో ఈ ఇద్ద‌రూ ప్ర‌జ‌ల‌ను వ‌దిలేసి సొంత రాజ‌కీయాల‌కే ప‌రిమితం కావ‌డం, అడుగ‌డుగునా వివాదాల‌కు ఆస్కారం ఇవ్వ‌డం పెద్ద మైన‌స్‌గా మారిపోయింది. ముఖ్యంగా ఓ స్వామికి సంబంధించిన భూముల వివాదంలో జేసీ దివాక‌ర్ రెడ్డి చూపిన అత్యుత్సాహం, పోలీసుల‌పై ఆగ్ర‌హావేశాలు వంటివి కూడా పెద్ద మైన‌స్‌గా మారాయి. ఇదిలావుంటే, పార్ల‌మెంటుకు వెళ్ల‌కుండా .. తానురాజీనామా చేస్తాన‌ని, నీళ్ల ఇవ్వ‌కుంగా త‌మ ప్రాంత రైతుల‌ను ఇబ్బంది పెడుతున్నారంటూ 2018లో జేసీ దివాక‌ర్ రెడ్డి చేసిన వ్యాఖ్య‌లు పార్టీలో వివాదానికి కార‌ణ‌మ‌య్యాయి. ఆ వెంట‌నే చంద్ర‌బాబు జోక్యం చేసుకుని నీరు వ‌చ్చేలా చేయ‌డం.. త‌ర్వాత స‌ర్దు మ‌ణ‌గ‌డం తెలిసిందే. ఇవ‌న్నీ ఒక ఎత్త‌యితే, అనంత‌పురం ఎమ్మెల్యే ప్ర‌భాక‌ర‌చౌద‌రిపై క‌త్తిక‌ట్టిన‌ట్టు వ్య‌వ‌హ‌రించ‌డం, సొంత పార్టీలోనే కుంప‌ట్లు పెట్ట‌డం కూడా జేసీ వ‌ర్గాన్ని టీడీపీలో విమ‌ర్శ‌ల‌కు గురి చేసింది.


శింగ‌న‌మ‌ల స‌హా కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో త‌న ప‌ట్టును నిలుపుకొనేందుకు జేసీ ప్ర‌య‌త్నించి విమ‌ర్శ‌ల‌కు తావిచ్చారు. ఇలా సాగిన ఐదేళ్ల రాజ‌కీయం.. 2019 ఎన్నిక‌ల స‌మ‌యానికి వ‌చ్చే స‌రికి ఇద్ద‌రూ త‌ప్పుకొని త‌మ వార‌సులను రంగంలోకి దింపేలా చేసింది. మొత్తంగా జేసీ దివాక‌ర్ రెడ్డి త‌న కుమారుడు ప‌వ‌న్‌ను, ప్ర‌భాక‌ర్ రెడ్డి త‌న కుమారుడు అస్మిత్‌ను రంగంలోకి దింపారు. అయితే, జ‌గ‌న్ సునామీ ముందు ఈ ఇద్ద‌రూ ఓడిపోయారు. అనంత‌పురం ఎంపీ సీటుఓడిపోయిన దానికంటే కూడా తాడిప‌త్రి నియోజ‌క‌వ‌ర్గంలో ఓట‌మి ఈ సోద‌రుల‌ను తీవ్రంగా ఇబ్బంది పెట్టింది. త‌మ‌కు పెట్ట‌ని కోట‌గా ఉన్న ఈ నియోజ‌క‌వ‌ర్గంలో తొలిసారి ఓడిపోవ‌డంతో ఇప్పుడు ఏం చేయాల‌నే విష‌యం చ‌ర్చ‌కు వ‌స్తోంది. వైసీపీ నుంచి గెలిచిన కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇప్పుడు నియోజ‌క‌వ‌ర్గంపై పెద్ద ఎత్తున దృష్టి పెట్టారు.


పార్టీని మ‌ళ్లీ మ‌ళ్లీ గెలిపించేలా ప‌క్కావ్యూహంతో ఇక్కడ కొన్ని ద‌శాబ్దాలుగా జేసీ వ‌ర్గం చేయ‌ని అభివృద్ధి చేసి చూపించాల‌ని, ప్ర‌తి ఎక‌రాకూ సాగునీరు అందేలా, ప్ర‌తి ఇంటికీ తాగునీరు అందేలా చూడాల‌ని నిర్ణ‌యించుకున్నారు. దీనికి సంబంధించి మాస్ట‌ర్ ప్లాన్‌ను సిద్ధం చేస్తున్న‌ట్టు స్థానికంగా వార్త‌లు వ‌స్తున్నాయి. ఇదే జ‌రిగితే.. ఇక్క‌డ మ‌రోసారి జేసీ వ‌ర్గం హ‌వా ఎత్తులు పారే అవ‌కాశం లేద‌ని తెలుస్తోంది. ఇదిలావుంటే, జేసీ కూడా పార్టీ మారాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు స‌మాచారం. త్వ‌ర‌లోనే ఆయ‌న రాజ‌కీయ స‌న్యాసానికి మ‌రోసారి స‌న్యాసం ఇచ్చి.. తానే స్వ‌యంగా బీజేపీ పంచ‌న చేరాలని భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఇది జ‌రిగితే.. రాజ‌కీయంగా జేసీ వ‌ర్గం మ‌రింత దెబ్బ‌తింటుంద‌ని అంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి. ఏదేమైనా తాడిప‌త్రి నియోజ‌క‌వ‌ర్గం రాజ‌కీయాలు ఆస‌క్తిగా మారాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: