జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక హోదాను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం గత నెల 5న నిర్ణయం తీసుకున్న అనంత‌రం మ‌రో కీల‌క‌ నిర్ణ‌యం తీసుకుంది. జమ్ముకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పార్టీ అధ్యక్షుడు ఫరూఖ్‌ అబ్దుల్లాను ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా భద్రత చట్టం (పీఎస్‌ఏ) కింద అరెస్టు చేసింది. ఆయనను గృహ నిర్బంధంలో ఉంచిన అధికారులు, ఆ ఇంటినే జైలుగా ప్రకటించారు. నిజానికి జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక హోదాను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం గత నెల 5న నిర్ణయం తీసుకున్నప్పటి నుంచే ఫరూఖ్‌ను నిర్బంధంలో ఉంచారు. దీనిని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరుగాల్సి ఉండగా, అంతకు కొద్ది గంటల ముందే ఫరూఖ్‌పై పీఎస్‌ఏ చట్టాన్ని ప్రయోగిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. 


ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగొట్టడం, లోయలో అశాంతిని సృష్టించడంలో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అధినేత ఫరూఖ్ అబ్దుల్లా ఎంతో సమర్థులని ఆయనపై మోపిన అభియోగాల్లో ప్రభుత్వం పేర్కొంది. ప్రస్తుత లోక్‌సభ సభ్యుడైన 81 ఏళ్ల‌ ఫరూఖ్‌పై అత్యంత కఠిన నిబంధనలున్న ప్రజా భద్రత చట్టం (పీఎస్‌ఏ) కింద కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. పీఎస్‌ఏ చట్టం కింద ఫరూక్‌పై మోపిన అభియోగ పత్రం పీటీఐ వార్తా సంస్థకు లభించింది. దీని ప్రకారం వేర్పాటువాదులు, ఉగ్రవాదులకు అనుకూలంగా ఫరూఖ్ పలు వ్యాఖ్యలు చేశారని ప్రభుత్వం ఆరోపించింది. 2016 తర్వా త వేర్పాటువాద సంస్థ హురియత్ కాన్ఫరెన్స్, ఇతర ఉగ్రవాద గ్రూపులకు అనుకూలంగా ఆయన మాట్లాడిన ఏడు సందర్భాలను ప్రస్తావించింది. ప్రజల జీవితాలకు, స్వేచ్ఛకు ఫరూక్ ముప్పుగా పరిణమించారని, వేర్పాటువాద సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నది.శ్రీనగర్ జిల్లాతోపాటు లోయ అంతటా అశాంతిని రేకెత్తించడంలో ఆయన ఎంతో సమర్థులని తెలిపింది. దేశానికి వ్యతిరేకంగా సామాన్యుల మనోభావాలను రెచ్చగొట్టారని ఆరోపించింది. 


పీఎస్‌ఏ చట్టంలోని ‘పబ్లిక్‌ ఆర్డర్‌' సెక్షన్‌ కింద ఆయనను అరెస్టు చేస్తున్నట్టు తెలిపింది. ఈ సెక్షన్‌ ప్రకారం ఓ వ్యక్తిని ఎటువంటి విచారణ లేకుండానే మూడు నుంచి ఆరు నెలల పాటు జైలుపాలు చేయవచ్చు. ఫరూఖ్‌పై పీఎస్‌ఏ చట్టాన్ని ప్రయోగిస్తున్నట్టు రాత్రి ఒంటి గంట సమయంలో అధికారులు ఆయనకు నోటీసు అందజేశారు. ఆ వెంటనే శ్రీనగర్‌ గుప్కార్‌ రోడ్డులోని ఫరూఖ్‌ ఇంటినే ఆయనను నిర్బంధించే జైలుగా ప్రకటించారు. జమ్ముకశ్మీర్‌కు మూడు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఫరూఖ్‌ అబ్దుల్లా ఐదుసార్లు పార్లమెంట్‌ సభ్యునిగా కూడా ఎన్నికయ్యారు.


81 ఏండ్ల వయస్సున్న ఫరూఖ్‌ గతంలో పలు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నారు. ఆయన గుండెలో వైద్యులు ఇదివరకే పేస్‌మేకర్‌ అమర్చారు. కొద్ది సంవత్సరాల క్రితం మూత్రపిండం మార్పిడి శస్త్ర చికిత్స కూడా జరిగింది. ప్రస్తుతం సిట్టింగ్‌ ఎంపీ అయిన ఫరూఖ్‌ అరెస్టు ప్రకటన వెలువడిన వెంటనే పోలీసులు ఆయన ఇంటిముందు బారికేడ్లు అమర్చి, ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు ఇనుప కంచె వేశారు. ఫరూఖ్‌తోపాటు ఆయన కుమారుడు మాజీ సీఎం ఒమర్‌ అబ్దుల్లా, మరో మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ, మరో 50 మంది వరకూ ప్రముఖ నాయకులను గత నెల 5 నుంచి గృహ నిర్బంధంలోనే ఉంచారు. ఎండీఎంకే నాయకుడు వైకో తలపెట్టిన బహిరంగ సభలో పాల్గొనకుండా అడ్డుకొనేందుకే ఫరూఖ్‌పై పీఎస్‌ఏను ప్రయోగించారని నేషనల్‌ కాన్ఫరెన్స్‌ వర్గాలు ఆరోపించాయి. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం జరుగడానికి ముందు ఫరూఖ్‌ వాణిని వినిపించకుండా ఉండేందుకే గృహ నిర్బంధంలో ఉంచారని పేర్కొన్నాయి. చివరిసారిగా గతనెల 6న ఫరూఖ్‌ తన ఇంటి గోడపైకి ఎక్కి మీడియాతో మాట్లాడారు.


మరింత సమాచారం తెలుసుకోండి: