మోడీ, ట్రంప్ పాల్గొంటున్న హౌడీ మోడీ సభపై ప్రపంచం దృష్టి కేంద్రీకృతమైంది. ఈ సభలో ట్రంప్ కీలక ప్రకటన చేస్తారని భావిస్తున్నారు. రెండు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం కూడా కుదిరే అవకాశం ఉంది. మరోవైపు సభకు హాజరుకాలేకపోతున్నందుకు డెమోక్రాట్ నేత తులసీ గబ్బార్డ్ మోడీకి సారీ చెప్పారు. హ్యూస్టన్ లో భారీ వర్షాలు కురుస్తున్నా.. సభ కోసం ఏర్పాట్లు చేస్తామని నిర్వాహకులు ప్రకటించారు. 


భారతీయ అమెరికన్లు అందరూ ఏకతాటిపై చేరనున్నహౌడీ మోడీ కార్యక్రమం జరిగే హ్యూస్టన్‌లో.. భారీ వర్షాలు కురుస్తున్నాయి.  టెక్సాస్‌ రాష్ట్రంలోని చాలా ప్రదేశాలు వరద గుప్పిట్లో చిక్కుకున్నాయి. హౌడీ మోడీ కార్యక్రమం జరిగే ఎన్‌ఆర్జీ స్టేడియం కూడా వరద గుప్పిట్లో చిక్కుకుంది. మునుపెన్నడూ లేని విధంగా అక్కడ వర్షాలు కురుస్తున్నాయి. సభ జయప్రదం చేయడానికి 1,500 మంది వాలంటీర్లు పాల్గొంటున్నారు. కార్యక్రమాన్ని మాత్రం విజయవంతం చేస్తామని వాలంటీర్లు హామీ ఇస్తున్నారు.


మెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న భారత సంతతికి చెందిన తులసీ గబ్బార్డ్‌.. ప్రధాని మోడీ రాకను స్వాగతించారు. అయితే కొన్ని కారణాల వల్ల హ్యూస్టన్ సభకు హాజరు కాలేకపోతున్నట్లు వెల్లడించారు.
అమెరికాకు భారత్ అత్యంత ముఖ్యమైన భాగస్వామి అని కితాబిచ్చిన తులసీ గబ్బార్డ్.. రెండు దేశాల మధ్య ఉన్న అనుబంధం ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు. భారత సంతతికి చెందిన తులసీ 2020 ఎన్నికల్లో అధ్యక్షపదవి కోసం పోటీ చేసేందుకు ఉత్సాహంగా ఉన్నారు. ఒక వేళ తులసీ అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిస్తే.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తలపడబోయే తొలి హిందువు ఈమే అవుతారు. ఈ ఎన్నికల్లో గెలుపొందితే... అధ్యక్ష పదవిదక్కిన అత్యంత పిన్న వయస్కురాలిగా, తొలి మహిళగా రికార్డు సృష్టిస్తారు.


దాదాపు 50 వేల మంది ప్రవాస భారతీయులు పాల్గొంటున్న హ్యూస్టన్ సభ అందరిలో ఆసక్తి రేకెత్తిస్తుంది. ఎన్నారైలు ఏర్పాటు చేసే ఓ ప్రైవేట్ కార్యక్రమంలో ట్రంప్ పాల్గొనడం ఇదే తొలిసారి. 2020 అధ్యక్ష ఎన్నికల ప్రచార సన్నాహాల్లో ఉన్న ట్రంప్.. అందులో భాగంగానే ఈ సభకు హాజరౌతున్నట్టు భావిస్తున్నారు. మొదటి నుంచీ డెమోక్రాట్లకు మద్దతుగా ఉన్న భారతీయ అమెరికన్లను ఆకట్టుకోవడానికి ట్రంప్ సభకు వస్తున్నట్టు చెబుతున్నారు. టెక్సాస్ లో భారతీయ అమెరికన్లు బలమైన ఓటు బ్యాంకుగా ఉన్నారు. మరోవైపు ఆర్టికల్ 370 రద్దు తర్వాత ట్రంప్, మోడీతో కలిసి సభలో పాల్గొంటున్న తరుణంలో.. అమెరికా.. భారత్ పక్షమే వహిస్తోందనే వాదన వినిపిస్తోంది. 




మరింత సమాచారం తెలుసుకోండి: