ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మృతిపై సీబీఐ విచారణకు ఆదేశించాలని తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. కోడెల సూసైడ్ పై పలు అనుమానాలు ఉన్న సంగతి పిటిషనర్ ప్రస్తావించారు. మరోవైపు కోడెలది ప్రభుత్వ హత్యేనంటూ చంద్రబాబు చేస్తున్న ఆరోపణలని కొట్టిపారేశారు వైసీపీ నేతలు. ఫర్నీచర్ కేసు విషయంలో ప్రజలని తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. 


ఏపీ మాజీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు మృతిపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఆయన మరణంపై అనుమానాలున్నాయనీ, సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరుతూ అనిల్ బూరగడ్డ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. కోడెలది ఆత్మహత్య కాదనీ, ఆయన తనయుడు శివరామే హత్య చేశాడన్న అనుమానాలున్నాయని పిటిషన్‌లో పేర్కొన్నారు. సీబీఐ విచారణకు ఆదేశించాలని న్యాయస్థానాన్ని కోరారు.


కోడెల కేసులో సీబీఐ, తెలంగాణ ప్రభుత్వం, బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ సీఐని పిటిషనర్ ప్రతివాదులుగా చేర్చారు. సీబీఐ విచారణ జరిపిస్తే కోడెల మరణానికి దారితీసిన పరిణామాలన్నీ బయటకు వస్తాయన్నారు. సంఘటన జరిగిన రోజు పరిణామాలు, కోడెల కుమార్తె ఫిర్యాదు అన్నింటిపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఇప్పటికే ప్రాథమిక సాక్ష్యాధారాలు కోర్టుకు సమర్పించాననీ, కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపిస్తే నిజాలు వెలుగులోకి వస్తాయని పిటిషనర్ కోర్టును అభ్యర్థించారు. 


కోడెలది ప్రభుత్వ హత్యే అంటూ చంద్రబాబు చేస్తున్న ఆరోపణల్ని కొట్టిపారేశారు వైసీపీ నేత అంబటి. కోడెల గతంలో కూడా ఒకసారి సూసైడ్ అటెంప్ట్ చేశారనీ, అప్పుడైనా చంద్రబాబు ఆయనకు మద్దతుగా మాట్లాడి ఉంటే ఖచ్చితంగా బతికి ఉండేవారన్నారు అంబటి రాంబాబు. కోడెల బతికి ఉన్నప్పుడు చట్టప్రకారం ఏ చర్యలు తీసుకున్నా సమ్మతమేనని చంద్రబాబు అన్నారని గుర్తుచేశారు అంబటి. మొత్తం మీద కోడెల మృతి కేసు హైకోర్టుకు చేరడంతో.. న్యాయస్థానం ఏ నిర్ణయం తీసుకుంటందనేది ఆసక్తికరంగా మారింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: