మొక్కజొన్న రైతులను కొత్త కష్టాలు చుట్టుమడుతున్నాయి.  మొన్నటి వరకు వర్షాలు లేక ఇబ్బంది పడ్డారు సిద్దిపేట జిల్లా రైతులు. ఇప్పుడు చేతికొచ్చిన పంటను కాపాడుకోవడానికి తంటాలు పడుతున్నారు. చీడపీడలు మొక్కజొన్న పంటను నాశనం చేస్తుండటంతో దిక్కుతోచని స్ధితిలో ఉన్నారు.   


సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ఈ సంవత్సరం వర్షాలు అంతంత మాత్రంగానే రావడంతో రైతులు కొంత మొక్కజొన్న పంటను సాగు చేశారు. ఇప్పటివరకు పంటపై కత్తెర పురుగు దాడి చేసి నష్టపరుస్తూ వచ్చింది. అది నివారణ కాకముందే పంటపై మిడత బెడద దడ పుట్టిస్తోంది. మొక్కజొన్న కంకి పాలు పోసుకునే సమయంలో మిడతల గుంపు దాడులు చేయడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.  పలుచోట్ల పంట పూర్తిగా ధ్వంసమై కనబడుతున్నాయి. 


మిరుదొడ్డి మండలం పరిధిలోని 3వేల ఎకరాల మొక్కజొన్న పాడైంది. విషయం తెలుసుకున్న వ్యవసాయ అధికారుల బృందం అక్కడ పర్యటించారు. పలు చోట్ల మొక్కజొన్నలను పరిశీలించారు. కొంతకాలంగా వర్షాలు పడకపోవడంతో ఉక్కపోత ఎక్కువై గడ్డి నుంచి మిడతల గుంపు పంటచేల లోకి వస్తుందని అన్నారు వ్యవసాయ అధికారులు.  పొలం అంచులని శుభ్రంగా ఉంచుకోవాలని రైతులకు సూచనలు చేశారు. మిడతల వల్ల నష్టపోయిన పంటలను పరిశీలించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామన్నారు. 


వర్షాభావ పరిస్థితులలో వేసిన మొక్కజొన్న పంటను ఓపక్క కత్తెర పురుగు తినేస్తుంటే మరో పక్క మిడతల గుంపు దాడి చేస్తోంది. పంటను పూర్తిగా ధ్వంసం చేస్తోంది. దీంతో పంట చేతికందడం మరింత కష్టంగా మారుతోంది. పంటకోసం చేసిన అప్పులు తీర్చే పరిస్థితి కనిపించడం లేదని వాపోతున్నారు రైతులు. ఆరుగాలం కష్టపడి పంటలు పండించి దేశానికి నాలుగు ముద్దలు అన్నం పెట్టే రైతన్నల పరిస్థితి దయనీయంగా మారింది. ఓ వైపు అతివృష్టి, అనావృష్టి బాధిస్తుంటే.. మరోవైపు చీడపీడలు పంటను నాశనం చేస్తున్నాయి.  



మరింత సమాచారం తెలుసుకోండి: