ఇటీవ‌లి కాలంలో వివాదాస్ప‌ద రీతిలో, పెద్ద ఎత్తున వార్త‌ల్లో నిలిచిన ఇంటర్ బోర్డు సెక్రటరీ అశోక్‌ను తెలంగాణ‌ రాష్ట్ర ప్రభుత్వం బ‌దిలీ చేసింది. ఆయన స్థానంలో 1998 బ్యాచ్‌కు చెందిన సయ్యద్ ఒమర్ జలీల్‌ను నియమిస్తూ సీఎస్ ఎస్కే జోషి శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. అయితే ఆరు నెలల్లో రిటైర్ అవబోతున్న అశోక్‌కి ప్రభుత్వం పోస్టింగ్ ఇవ్వక‌పోవ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.  జలీల్ గతంలో నల్గొండ, వరంగల్, మెదక్ జిల్లాల జేసీగా పనిచేశారు. ఆ తర్వాత బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా జలీల్ పనిచేశారు. వికారాబాద్ జిల్లా కలెక్టర్ గా చేసి అక్కడి నుంచి బదిలీ అయిన జలీల్.. అప్పటి నుంచి పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్నారు. 


కాగా, ఇంట‌ర్ ఫ‌లితాల్లో అశోక్ చేసిన వ్యాఖ్య‌లు వివాదాస్ప‌దం అయిన సంగ‌తి తెలిసిందే. తీవ్ర దుమారం రేపుతున్న ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ – 2019 ఫలితాల వివాదంపై  పెద్దఎత్తున విద్యార్థులు, తల్లిదండ్రులు నాంపల్లిలోని ఇంటర్ బోర్డ్ ఆఫీసుకు వచ్చి ధర్నా చేయడంతో ఇంటర్మీడియట్ బోర్డ్ సెక్రటరీ అశోక్ స్పందిస్తూ ఫలితాల విడుదలలో తాము ఏ తప్పూ చెయ్యలేదేని చెప్పారు. పేపర్ల కరెక్షన్ పారదర్శకంగానే జరిగిందన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు చెప్పేవి అన్నీ తప్పుడు వార్తలని ఆయన అన్నారు. సమస్య ఉంటే రీ -కౌంటింగ్, రీ వాల్యుయేషన్ చేస్తామనీ.. అప్లై చేసుకోవాలని ఆయన అన్నారు.


 “ఫెయిల్ అయ్యిన వాళ్ళు వంద మాట్లాడుతారు….అవి బోర్డ్ పట్టించుకోదు. స్టూడెంట్స్ ఫెయిల్ అవుతారు. అవన్నీ బోర్డ్ మీదనెట్టడం సమంజసం కాదు” అని ఇంటర్ బోర్డ్ సెక్రటరీ అశోక్ చెప్పడంతో…అక్కడున్న విద్యార్థులు, తల్లిదండ్రులు ఒక్కసారిగా సీరియస్ అయ్యారు. “ఆన్సర్ షీట్ ఇస్తామని అంటున్నాం. ఇంతకంటే పారదర్శకంగా ఎవరైనా ఉంటారా. మ్యాథ్స్‌లో బాగున్నవారు.. ఇంగ్లీష్ లో వీక్ ఉండొచ్చు. ఎందుకు తక్కువొచ్చాయంటే ఎలా. ఉండొచ్చు కదా. మీకు ఆన్సర్ షీట్స్ ఇస్తా. రీ వెరిఫికేషన్  చేయడానికి సిద్ధం. 10 లక్షల మంది ఉన్నారు. విద్యార్థులు ఫెయిలవ్వడానికి చాలా కారణాలు ఉంటాయి. అవ అనుమానం ఉంటే వెరిఫికేషన్ పెట్టుకోండి. నేను ఛాలెంజ్ చేస్తున్నా… బోర్డు ఎటువంటి తప్పు చేయలేదు. వెబ్ సైట్ ఓపెన్ గానే ఉంది” అన్నారు. కాగా, అధికారి స్థాయిలో ఉండి కూడా అశోక్ ఎదురుదాడి చేసినట్టుగా మాట్లాడటంతో… విద్యార్థులు, తల్లిదండ్రులు బోర్డుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: