నిజంగా మనదేశంలో వున్న కట్టడాలంటే రాజుల కాలంలో కట్టినవి గొప్పకట్టడాలని గర్వంగా చెప్పవచ్చూ.అప్పుడు ఏ సిమెంటు వాడారో,ఎంతకష్టపడి కట్టారో తెలియదు కాని అవి ఇప్పటికి ఎన్ని ప్రకృతి వైపరిత్యాలు వచ్చినా తట్టుకుని నిలబడ గలుగుతున్నాయి..ఇప్పటికి నిజాం కాలంలో నిర్మించిన భవనాలు,వంతెనలు నేటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. నాడు నిర్మాణాల విషయంలో ఎంత జాగ్రత్తలు తీసుకున్నారో ఇప్పటికీ నిలిచి ఉన్న కట్టడాలే నిదర్శనం.కానీ ఇప్పుడు మాత్రం నిర్మాణంలో ఉండగానే కట్టడాలు కూలిపోతున్నాయి.ఇక టీవిలో వచ్చే యాడ్స్‌లో మా సిమెంట్ నాణ్యతకు, నమ్మకానికి అమ్మవంటిది ఎల్లకాలం గట్టిగా నిలచి వుంటుందని గొప్పగా చెబుతారు,ఇక చెప్పేవాడి తప్పా కట్టేవారి తప్పా ఆ పైవాడికే తెలియాలి.



ఇక మన తెలంగాణ దొరలు కట్టిస్తున్న రాజన్న సిరిసిల్ల జిల్లాలోని  ఓ బ్రిడ్జి నిర్మాణంలో  ఉండగానే పూర్తిగా ఒరిగిపోయింది. దానికి కారణం గత మూడు రోజులుగా కురుస్తోన్న భారీ వర్షాలకు వేములవాడ మూలవాగు పొంగిపొర్లుతుండటం వల్ల అని చెబుతున్నారు.అక్కడ ప్రవహించే వరద ప్రవాహం ధాటికి రూ.22 కోట్లతో నూతనంగా హైలెవల్ బ్రిడ్జికి సంబంధించిన రెండు పిల్లర్లు విరిగాయట.దీంతో బ్రిడ్జి విరిగి ఒరిగిపోయిందని అధికారులు తెలిపారు.ఇక బెల్లం ఎక్కడుంటే ఈగలు అక్కడే అన్నట్లు గా ఇక్కడ ప్రవహించే ప్రవాహాన్ని, కూలిన బ్రిడ్జిను చూడడానికి నాయకులు,ప్రజలు తండోపతండాలుగా తరలివస్తున్నారు.ఇక బిజెపి,కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు ప్రతాప రామకృష్ణ, ఆది శ్రీనివాస్ కూలిన బ్రిడ్జిని పరిశీలించారు.వారు మాట్లాడుతూ నాసిరకం పనులతో బ్రిడ్జి కూలిందని దీనికి పాలకులే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు బ్రిడ్జి కూలిన విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్‌,మూలవాగు ప్రాంతానికి చేరుకుని,బ్రిడ్జి కూలిన ప్రదేశాన్ని పరిశీలించారు.బాధ్యులపై తగు చర్యలు తీసుకుంటామని, వెంటనే నివేదిక అందజేయాలని ఆర్‌అండ్‌బి అధికారులను ఆదేశించారు.



అనంతరం కరీంనగర్ ఉమ్మడి జిల్లా సూపరిటెండెంట్ ఇంజనీర్ రాఘవచార్యులు మాట్లాడుతూ పట్టణంలో రెండు నూతన బ్రిడ్జిల నిర్మాణంలో భాగంగా మొదటి బ్రిడ్జి పూర్తి అయిందని,రెండవ బ్రిడ్జికి సంబంధించిన స్పాన్ సెంట్రింగ్ పనులు జరుగుతున్నాయని,బోస్టింగ్ గడ్డర్ అనే ఆర్చి బ్రిడ్జి మొదట బీములు వేసి స్లాబులు వేస్తాం,కింద సపోర్ట్ పెట్టిన తరువాత బీములు,స్లాబులు వేయడం జరుగుతుందన్నారు.వర్టికల్స్ బీములు,ఆర్చీ బీమ్స్ పూర్తి చేయాలన్నారు.మొత్తం పూర్తి అయితేనే స్పాన్ పనులు పూర్తి అవుతాయన్నారు.అప్పటిదాకా వరకు కింద వాగులో పెట్టిన సెంట్రింగ్ ఉంచాల్సి ఉంటుందన్నారు.ఆ విధంగా ఉంచినప్పుడే దాని అర్చి స్టాండ్,స్పాన్ కూడా పూర్తి అయి,స్టేజ్ నిర్మాణం జరుగుతుంది.ఇక ఈ నెల 17వ తేదీన భారీ వర్షం కురవడంతో మూల వాగులో ప్రవాహం వచ్చి, ఇసుకలో ఉన్న సెంట్రింగ్ కొట్టుకు పోవడం మూలాన,ఆ కొట్టుకు పోయిన భాగమే కృంగిపోయి,బ్రిడ్జి కూలిపోయిందని,ఈ బ్రిడ్జి పని ఇంకా పూర్తి కాలేదన్నారు.ఇది నాణ్యత లోపం కాదని.దీనికి పూర్తి బాధ్యత కాంట్రాక్టర్ శరత్ వహించాల్సి వస్తుందని ఈ సందర్బంగా వివరించారు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: