భార‌త్ ఒక యూనియ‌న్ కంట్రీ. స‌మాఖ్య ప్ర‌భుత్వం. రాష్ట్రాల హ‌క్కులు రాష్ట్రాల‌కు ఉంటాయి. అదేస‌మ‌యంలో కేంద్రానికి విశేష‌మైన అధికారులు కూడా ఉంటాయి. అయిన‌ప్ప‌టికీ.. రాష్ట్రాల విష‌యంలో జోక్యం చేసుకునే హ‌క్కు మాత్రం దీనికి పెద్ద‌గా ఉండ‌దు. అవ‌స‌మైతేనే త‌ప్ప రాష్ట్రాల విష‌యంలో వేలు పెట్ట‌డానికి వీల్లేదు. అయితే, రెండోసారి కేంద్రంలో అధికారంలోకి వ‌చ్చిన బీజేపీ స‌ర్కారు మాత్రం ఒంటెత్తు పోక‌డ‌లు పోతోంద‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. క‌శ్మీర్‌కు కొన్ని ద‌శాబ్దాలుగా ఉన్న ఆర్టిక‌ల్ 370 ద్వారా సంక్ర‌మించిన ప్ర‌త్యేక ప్ర‌తిప‌త్తిని ప‌క్క‌న పెట్టింది.


అదే స‌మ‌యంలో తాజాగా రాష్ట్రాల‌పై హిందీని రుద్దాల‌నే ఉద్దేశాన్ని కూడా వెలుగులోకి తెచ్చారు. ఈ విష‌యంపై ఇటీవ‌ల కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన ప్ర‌క‌ట‌న దేశ‌వ్యాప్తంగా ద‌క్షిణాది రాష్ట్రాల్లో ప్ర‌కంప‌న‌లు పుట్టాయి. ఒకే దేశం ఒకే ప్రజ ఒకే మతం ఒకే పన్ను ఒకే ఎన్నిక ఒకే పార్టీ లాంటి మాటలు ఇటీవ‌ల కాలంలో బీజేపీ ఎక్కువ‌గా ప్ర‌స్థావిస్తు న్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలోనే దేశానికి రాజ‌భాష‌గా ఉన్న హిందీని అన్ని రాష్ట్రాల్లోనూ నేర్చుకుని తీరాల‌నే ప్ర‌త్యేక వాద‌న‌ను కేంద్ర పెద్ద‌లు తీసుకువ‌చ్చారు.


దేశ జనాభాలో సగం మంది కూడా మాట్లాడని -ఇంతకాలం ఇచ్చిన ప్రోత్సాహాల తర్వాత కూడా పెద్దగా ఆధునికం కాని హిందీని ఇప్పుడు ద‌క్షిణాదిపై రుద్ద‌డంలో ప్ర‌ధాన ఉద్దేశం రాజ‌కీయంగా బీజేపీ ఎదుగుద‌ల‌కే త‌ప్ప మ‌రో సూత్రం మ‌న‌కు క‌నిపించ‌డం లేదు. కేంద్రం నుంచి ఎవ‌రు వ‌చ్చి హిందీలో మాట్లాడినా.. ఇక్క‌డ ట్రాన్స్‌లేట్ చేయాల్సిన ప‌రిస్థితి ఉంది. అందుకే మీకు మాకు పెద్ద‌గా క‌మ్యూనికేష‌న్ స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయంటూ.. సాక్షాత్తూ.. త‌మిళ‌నాడు స‌భ‌లో గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో ప్ర‌ధాని మోడీ అన్నారు.


అంటే.. భాషా స‌మ‌స్య‌ను తీర్చ‌డం పోయి.. రాజ‌కీయ స‌మ‌స్య‌గా భాష‌ను మార్చ‌డంలోనే పెద్ద‌ల కుట్ర అవ‌గ‌తం అవుతోంది. ప్రాంతానికి ప్రాంతానికి మ‌ధ్య వైరుధ్యం ఉంది. భాష‌ల్లోనూ వ్య‌త్యాసం ఉంది. భిన్న‌త్వంలో ఏక‌త్వంగా ఉన్న ఈ దేశంలో భాషా ప్రాతిప‌దిక‌న రాష్ట్రాలు మొగ్గ‌తొడిగాయి. అలాంటి దేశంలో కేవ‌లం ఒకే భాష‌కు ప‌ట్టం క‌డ‌తామ‌నే ప్ర‌క‌ట‌న ఒకింత రాజ‌కీయ దురుద్దేశంతో కూడుకున్న‌దే అయివుంటుంద‌నేది వాస్త‌వం. ఇదిలావుంటే, అమిత్ షా చేసిన ప్ర‌క‌ట‌న‌ను కొన్ని ద‌క్షిణాది రాష్ట్రాలు ఖండించాయి. ముఖ్యంగా త‌మ పాల‌కుడే ఉన్న క‌ర్ణాట‌క రాష్ట్రం కూడా అమిత్ ప్ర‌క‌ట‌న‌ను ఖండించారు.


ఇక‌, త‌మిళ‌నాడు గురించి ప్ర‌త్యేకంగా చెప్పేదేముంది. కానీ, ఎటొచ్చీ.. బీజేపీ ఎదుగుదామ‌ని ప్ర‌క‌టిస్తున్న, ఎదిగేందుకు ఉన్న అన్ని పంథాల‌ను వినియోగిస్తున్న రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఈ హిందీ రుద్దుడుపై ఏ ఒక్క‌రూ స్పందించ‌లేదు. అటు కేసీఆర్ కానీ, ఇటు జ‌గ‌న్ కానీ, నోరు మెద‌ప‌లేదు.. పెద‌వి విప్ప‌లేదు. ఈ నేప‌థ్యంలో అస‌లు వీరు కేంద్రానికి భ‌య‌ప‌డుతున్నారా?  లేక కేంద్రం అడుగు జాడ‌ల్లోనే న‌డుస్తున్నారా? అనే సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: