చంద్రబాబునాయుడు తాజాగా చేసిన ట్వీట్ చూస్తుంటే అదే అనుమానం వస్తోంది. గ్రామ సచివాలయం నియామకాల పరీక్షల ప్రశ్నపత్రం లీకైందని ఎల్లోమీడియా ప్రముఖంగా ఓ కథనం అచ్చేసింది. దాన్ని పట్టుకుని చంద్రబాబు ఊగలాడుతున్నారు. అదే విషయాన్ని ట్విట్లర్లో కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై విరుచుకుపడిపోయారు.

 

ప్రశ్నపత్రం లీకేజిని భారీ స్కాంగా చంద్రబాబు వర్ణిస్తుండటమే విచిత్రంగా ఉంది. చంద్రబాబు మాటలే నిజమైతే తన హయాంలో లీకైన ప్రశ్నపత్రాల మటేమిటి ?  ప్రశ్నపత్రాల లీకు నిజమే అయితే తప్పు ఎక్కడ జరిగిందో ప్రభుత్వం గుర్తించాలి. బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిందే అనటంలో సందేహం లేదు. అంతమాత్రాన ప్రభుత్వమే పనిగట్టుకుని భారీ స్కాం జరిపిందని చంద్రబాబు అనటంలో అర్ధం లేదు.

 

ప్రశ్నపత్రాలను కావాలనే లీక్ చేయించి లక్షలాది మంది నిరుద్యోగులను దగా చేశారంటున్నారు. నిరుద్యోగుల భవితకు ఉరేశారని అనేశారు చంద్రబాబు. నిరుద్యోగుల గురించి, భవిష్యత్ గురించి చంద్రబాబే మాట్లాడాలి. తన హయాంలో ఒక్క నిరుద్యోగికి కూడా ఉద్యోగం ఇచ్చిన పాపాన పోలేదు చంద్రబాబు. ఉద్యోగాలు ఇవ్వకపోతే కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ లో  పని చేస్తున్న  వేలాదిమందిని తీసేశారు.

 

మళ్ళీ ఓట్ల కోసమని మోసం చేయటంలో భాగంగా హడావుడిగా నిరుద్యోగ భృతి అంటూ నాటకాలాడిన విషయం అందరూ చూసిందే. అలాంటి చంద్రబాబు హయాంలోనే 10వ తరగతి పరీక్షలు, ఇంటర్మీడియట్ పరీక్షల ప్రశ్నపత్రాలు లీకైన మాట వాస్తవం కాదా ?  తన సన్నిహితుడైన నారాయణ విద్యా సంస్ధల నుండే ప్రశ్నపత్రాలు లీకైనట్లు ప్రాధమిక సాక్ష్యాలున్నా ఎటువంటి చర్యలు తీసుకున్నారు ?

 

అప్పుడు లక్షలాది విద్యార్ధుల జీవితాలతో చంద్రబాబు ఆడుకున్నది వాస్తవమే కదా ? అంటే తాను కూడా భారీ స్కాంలకు పాల్పడినట్లు చంద్రబాబు ఒప్పుకుంటున్నట్లేనా ? నిజంగా రాష్ట్రంపై ప్రేమ ఉన్న వ్యక్తే అయితే ప్రశ్నపత్రాలు లీకు కాకుండా ఎలా పరీక్షలు నిర్వహించాలో సలహాలు ఇవ్వచ్చు. అంతేకానీ నిరుద్యోగులను ప్రభుత్వంపై రెచ్చ గొడుతూ శాంతి భద్రతలకు విఘాతం సృష్టించటం కాదు చేయాల్సింది.

 

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: