తెలుగు సిని పరిశ్రమకు చెందిన సీనియర్ నటుడు, టీడీపీ నేత శివప్రసాద్ కన్నుమూశారు. టీడీపీలో ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా, రెండు సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. 2009, 2014లో రెండు పర్యాయాలు ఎంపీగా ప్రజలకు సేవ చేశారు. ఉమ్మడి ఏపీలో టీడీపీ హయాంలో సమాచార ప్రసారాల శాఖను నిర్వహించారు. సినిమాల్లోనూ రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేశారు.

 


ముఖ్యంగా ఆయన ఎంపీగా టీడీపీ తరపున ఆ పార్టీ చేసిన పోరాటాల్లో తనదైన పాత్ర పోషించారు. ప్రత్యేక హోదా సాధన సమయంలో టీడీపీ పిలుపు మేరకు పార్లమెంట్ బయట ఆయన చేసే వినూత్న నిరసన దేశవ్యాప్తంగా ఆకర్షించేది. తనదైన సినిమా అనుభవంతో అనేక రూపాల్లో ఆయన తమ నిరసన తెలిపేవారు. పాటలతో, హరికథ, బుర్రకథ, మూగవేదన.. ఇలా పలు రకాల పద్ధతుల్లో ఆయన తన నిరసన తెలిపే విధానం పార్లమెంట్ సభ్యులు కూడా మాట్లాడుకునేవారు. విచిత్రమైన వేషదారణతో ఏపీ ప్రజల సమస్యలను ఆయన ఢిల్లీ స్థాయిలో చెప్పడంలో ఆయన స్పెషలిస్టు. ఇందుకు ఆయన సినిమా నేపథ్యం ఎంతో ఉపయోగపడిందనే చెప్పాలి. ఆయనపై నమ్మకంతో చంద్రబాబు పలు దఫాలుగా అవకాశం కల్పించారు. మంత్రిగా ఆయన ప్రజలకు చేసిన సేవలను గుర్తించిన చంద్రబాబు ఎంపీగా కూడా అవకాశం ఇచ్చారు.

 


గతేడాది ఆయన టీడీపీ పట్ల కొంత అసంతృప్తిగా ఉన్నారని సన్నిహితులు అంటూంటారు. పలు వేదికలపై బహిరంగంగానే చంద్రబాబు తీరును తప్పు పట్టారు. దళితుల సమస్యల పట్ల టీడీపీ స్పందించడం లేదని, తాను అనారోగ్యానికి గురైనా చంద్రబాబు తనను కనీసం పరామర్శించలేదని ఆవేదన చెందారు. దీంతో వ్యతిరేకత ఎక్కువ కాకూడదనే ఉద్దేశ్యంతో ఆయనను పార్టీ బుజ్జగించింది. చంద్రబాబు పిలిచి మాట్లాడాక శాంతించిన ఆయన మళ్లీ టీడీపీలో చురుగ్గానే వ్యవహరించారు. ఆయన లేకపోవడం టీడీపీకి లోటే.

 


మరింత సమాచారం తెలుసుకోండి: