ఈ మద్య టీడీపీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే.  ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి స్పీకర్, డాక్టర్ కోడెల శివప్రసాద్ ఆత్మహత్య చేసుకొని మృతి చెందారు..ఈ చేదు వార్త మరవక ముందే మరో టీడీపీ నేత, నటుడు శివ ప్రసాద్ కన్నుమూశారు. రాజకీయాల్లోనే కాకుండా టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా నటుడిగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న శివ ప్రసాద్ కన్నుమూశారు. చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో ఆయన తుదిశ్వాస విడిచారు. గత కొంత కాలంగా ఆయన మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నారు.

1951 జూలై 11న చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం పులిత్తివారిపల్లి గ్రామంలో ఆయన జన్మించారు. 1999 నుంచి 2004 వరకు ఎమ్మెల్యేగా పని చేశారు. సమాచార, సాంస్కృతిక మంత్రిగా శివప్రసాద్ పని చేశారు. 2009, 2014లో చిత్తూరు నుంచి ఎంపీగా గెలుపొందారు. సినిమాల్లో ఆయన నటిస్తున్నారు అంటే ఆ పాత్ర చాలా ప్రత్యేకమైనదని ముందే  చెప్పవచ్చు. పలు సినిమాల్లో నటించి, ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నారు.  పిల్ల జమిందార్ - మస్కా - లక్ష్మి - తులసి - యముడికి మొగుడు - బాలు -జై చిరంజీవ వంటి సినిమాల్లో డిఫరెంట్ గా నటించి ప్రశంసలు అందుకున్నారు.

చివరగా శివ ప్రసాద్ 'సై ఆట' సినిమాలో నటించారు. మొత్తంగా 25కి పైగా సినిమాల్లో నటించిన ఆయన పలు సినిమాలకు దర్శకత్వం వహించారు. ఆయన డైరక్ట్ చేసిన సినిమాల్లో రాజేంద్ర ప్రసాద్ 'టోపీ రాజా స్వీటీ రోజా' ఆడియెన్స్ ని మెప్పించింది. తాజాగా  శివప్రసాద్ మరణంపై టీడీపీ అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

‘నా చిరకాల మిత్రుడు, పార్లమెంటు మాజీ సభ్యుడు, టీడీపీ నేత, డా.ఎన్ శివప్రసాద్‌ గారి మరణం విచారకరం. ప్రత్యేకహోదా సహా విభజన చట్టంలో హామీల అమలు కోసం ఆయన రాజీలేని పోరాటం చేశారు. ఆయన మృతి చిత్తూరు జిల్లాకే కాకుండా, మొత్తం ఆంధ్ర రాష్ట్రానికే తీరని లోటు’ అని వ్యాఖ్యానించారు.  వారం రోజుల వ్యవధిలో ఇద్దరు సీనియర్ నేతలను కోల్పోవడం టీడీపీకి తీరని లోటని విచారం వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: