సినీ నటుడు,   చిత్తూరు మాజీ ఎంపీ, టీడీపీ నాయకుడు  నారమల్లి శివప్రసాద్‌ అనారోగ్యం కారణంగా మృతి చెందారు.  గత నెలలుగా వెన్నునొప్పి, కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన ఈ రోజు తుదిశ్వాస విడిచారు.  ప్రత్యేక హోదా ఉద్యమంలో తనదైన ప్రత్యేక శైలితో శివ ప్రసాద్‌ ఆకట్టున్నారు.  శివప్రసాద్ 2009లో టీడీపీ తరపున చిత్తూరు ఎంపీగా పోటీ చేసి గెలిచారు. తర్వాత 2014 ఎన్నికల్లోనూ ఘన విజయం సాధించారు. అయితే గత  సార్వత్రిక ఎన్నికల్లో  మాత్రం వైఎస్సార్‌సీపీ అభ్యర్థి రెడ్డప్ప చేతిలో ఓడిపోయారు. కాగా అరోగ్యం సహకరించకపోవడంతో కొద్దిరోజులుగా ఆయన పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారు. శివప్రసాద్ రాజకీయ రంగం మాత్రమే కాదు.. సినిమాల్లోనూ రాణించారు.  ఆయన ఎన్నో సినిమాల్లో  మంచి పాత్రల్లో  నటించారు.  మొదట  తిరుపతిలో డాక్టర్‌గా పని చేసిన ఈయన నటన మీద మక్కువతో సినీ రంగం వైపు అడుగులు వేశారు. ఖైదీ లాంటి హిట్‌ సినిమాలో జూనియర్‌ ఆర్టిస్ట్‌ గా నటించిన ఈయన.. క్రమంగా ఎదుగుతూ  2006 సంవత్సరంలో విడుదలైన డేంజర్ సినిమాలో విలన్‌ గా నటించి మెప్పించారు.   ఈ సినిమాలో ఈయన నటనకు ప్రభుత్వం నంది అవార్డు ఇచ్చి సన్మానించింది. కాగా ఆయన మృతి పట్ల ప్రముఖలు సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు శివ ప్రసాద్ మృతి పట్ల స్పందిస్తూ..  'నా చిరకాల మిత్రుడు, మాజీ ఎంపీ, టీడీపీ నేత, డా.ఎన్ శివప్రసాద్‌ గారి మరణం విచారకరం. ప్రత్యేక హోదా సహా విభజన చట్టంలో హామీల అమలు కోసం రాజీలేని పోరాటం చేశారు. ఆయన మృతి చిత్తూరు జిల్లాకే కాకుండా, మొత్తం ఆంధ్ర రాష్ట్రానికే తీరని లోటు' అని.. శివప్రసాద్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. వారం రోజుల వ్యవధిలో ఇద్దరు సీనియర్ నేతలను కోల్పోవడం పార్టీకి తీరని లోటు. అని ట్వీట్ చేశారు. 

    

కాగా తెదేపా సీనియర్ నాయకులు కూడా  డాక్టర్ ఎన్ శివప్రసాద్‌ గారి మృతికి నివాళులర్పిస్తూ..  వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. ఇక శివప్రసాద్ సొంతూరు చిత్తూరు జిల్లాలోని పూటిపల్లి, 1951 జూలై 11న అప్పటి మద్రాస్ రాష్ట్రంలో జన్మించారు. చిన్నప్పటి నుంచి నాటకాలంటే పిచ్చి. స్వతహాగా రంగస్థల నటుడు. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించారు. విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మెప్పించారు. ప్రేమ తపస్సు, టోపి రాజా స్వీటీ రోజా, ఇల్లాలు, కొక్కొరొకో అనే నాలుగు సినిమాలకు దర్శకత్వం కూడా వహించారు. సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. మా తరుపున నారమల్లి శివప్రసాద్‌  మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ, శోహార్తులైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము.  


మరింత సమాచారం తెలుసుకోండి: