చిత్తూరు మాజీ ఎంపి శివప్రసాద్ (68) మధ్యాహ్నం 2గంటల 7నిమిషాలకు తుది శ్వాస విడిచారు. ఈ మేరకు అపోలో ఆసుపత్రి వైద్యులు అధికారిక ప్రకటన చేశారు.  గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ శనివారం తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ ఏడాది తెలుగు దేశం పార్టీకి పెద్ద దెబ్బలే తగులుతున్నాయి. ఇటీవల ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోవడవం..మాజీ స్పీకర్ కోడెల శివ ప్రసాద్ ఆత్మహత్య చేసుకోవడం..తాజాగా సినీ నటుడు, మాజీ చిత్తూరు ఎంపీ శివ ప్రసాద్ కన్నుమూయడం..వంటివి టీడీపీ నేతలను శోక సంద్రంలో ముంచాయి. 

2009, 2014లో చిత్తూరు లోక్‌సభ స్థానం నుంచి తెదేపా తరఫున ఆయన బరిలో దిగి విజయం సాధించారు. శివ ప్రసాద్ డాక్టర్ గా కొన్నాళ్ళు సేవలందించి ఆ తరువాత సినిమాల్లోకి వచ్చారు. పిల్ల జమిందార్ - మస్కా - లక్ష్మి - తులసి - యముడికి మొగుడు - బాలు -జై చిరంజీవ వంటి సినిమాల్లో డిఫరెంట్ గా నటించి ప్రశంసలు అందుకున్నారు. చివరగా శివ ప్రసాద్ 'సై ఆట' సినిమాలో నటించారు. సినీనటుడిగా రాణించిన శివప్రసాద్‌.. తెదేపా హయాంలో మంత్రిగానూ వ్యవహరించారు.  ఏపీకి ప్రత్యేక హోదా విషయంపై పార్లమెంటులో వివిధ వేషాధారణలతో నిరసన తెలిపారు. టిడిపి సీనియర్ నేత,చిత్తూరు మాజీ ఎంపీ శివప్రసాద్ మృతి పట్ల టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సంతాపం తెలిపారు. నటుడు,నాయకుడు గా ప్రజల హృదయాలు గెలుచుకున్న నేత శివప్రసాద్ అని శ్లాఘించారు. 

తెలుగుదేశం పార్టీ బలోపేతానికి ఎంతగానో కృషి చేశారని కొనియాడారు. ప్రత్యేక హోదా సాధన కోసం పార్లమెంట్ వేదికగా పోరాటం చేశారని చెప్పారు.  శివప్రసాద్ గారి మృతి తెలుగుదేశం పార్టీకి తీరని లోటు అని అన్నారు.  శివప్రసాద్ గారి కుటుంబ సభ్యులకు లోకేష్ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: