ఉప ఎన్నిక జ‌రిగేది తెలంగాణ‌లో.. అందులో తెలంగాణ కోసం పోరాడిన పార్టీగా చెప్పుకునే టీ ఆర్ ఎస్ పార్టీ. . కానీ టికెట్ ఇచ్చింది మాత్రం ఆంధ్ర‌కు చెందిన వ్య‌క్తిగా అంటూ పీసీసీ అధ్య‌క్షుడు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి టీ ఆర్ ఎస్‌పై విరుచుకుప‌డ్డారు. హుజూర్ నగర్ నియోజకవర్గ ఉపఎన్నికకు షెడ్యూల్ విడుదలైన వెంటనే పార్టీల మధ్య విమర్శల యుద్ధం మొదలైంది. ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తికి టీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చిందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. టీ ఆర్ ఎస్ అభ్య‌ర్థికి లోక‌ల్ అభ్య‌ర్థే లేకుండా పోయాడా అంటూ పీసీసీ అధ్య‌క్షుడు టీ ఆర్ ఎస్ పార్టీపై దుమ్మెత్తి పోసారు.


తెలంగాణ‌లో అభివృద్ది చేయలేని కేసీఆర్‌, హుజూర్ నగర్ అభివృద్ధి కోసం టీఆర్ఎస్ ప్ర‌భుత్వం ఏం చేసిందో చెప్పాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు. హుజూర్‌న‌గ‌ర్  ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ 30 వేల మెజార్టీతో గెలవడం ఖాయమని ఆయన ధీమా వ్య‌క్తం చేశారు. బంగారు తెలంగాణ చేస్తానని చెప్పిన కేసీఆర్ ఈ ఆరేళ్లలో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. హుజూర్ నగర్ లో కాంగ్రెస్ ను గెలిపించి కేసీఆర్ నియంతృత్వ పాలనకు చరమగీతం పలకాలని పిలుపునిచ్చారు.


హుజూర్‌న‌గ‌ర్ ఉప ఎన్నిక రాష్ట్రానికి మార్గదర్శకం కావాలని ప్ర‌జ‌ల‌ను కోరారు.   కాంగ్రెసుకు ఓటేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, కేసీఆర్ కు గుణ‌పాఠం చెప్పాల‌ని పిలుపునిచ్చారు. హుజూర్‌న‌గ‌ర్ ఉప ఎన్నిక పీసీసీ అధ్య‌క్షుడు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి రాజీనామాతో అనివార్య‌మైంది. ఉత్త‌మ్ కుమార్ రెడ్డి న‌ల్ల‌గొండ ఎంపీగా ఎన్నిక కావ‌డంతో ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేయ‌డంతో ఉప ఎన్నిక అనివార్యం అయింది. ఈ ఎన్నికల్లో ఉత్త‌మ్ త‌న భార్య ప‌ద్మావ‌తిని బ‌రిలోకి దింపుతున్నారు. ఎన్నిక‌ల న‌గారా మోగిందో లేదో రాజ‌కీయ విమ‌ర్శ‌లు మొద‌ల‌య్యాయి. 



మరింత సమాచారం తెలుసుకోండి: